గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఎన్నికల సందడి రాబోతుంది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లతో పాటు 5,773 ఎంపీటీసీ, 566 జడ్పీటీసీ స్థానాలకు స్వల్ప వ్యవధిలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనకు త్వరలోనే స్వస్తి పలకనుంది. ఆర్థిక సంఘం నిధులు తెచ్చుకోవడంతో పాటు.. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి స్థానిక సంస్థల ప్రక్రియ పూర్తిగా క్లియర్ చేసుకోవాలని యోచిస్తున్నది. ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.
నవంబర్ 9వ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. తుది ఓటరు జాబితా బయటకు రాగానే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల కోసం వార్డులు, గ్రామాల వారీగా డేటాను విభజించనుంది. రిజర్వేషన్ల ఖరారుకు, పోలింగ్ కేంద్రాల సర్దుబాటుకు ఈ సవరించిన ఓటర్ల లిస్టే ప్రామాణికం కానుండటంతో ప్రభుత్వం ఈ ప్రక్రియపై ఆరా తీస్తోంది. నవంబర్ రెండో వారంలోగా జాబితా చేతికి రాగానే తదుపరి నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
