జీసీసీలు,ఐటీకి తిరుగులేని అడ్డాగా తెలంగాణ..మరింత ముందుకు లైఫ్ సైన్సెస్ 

జీసీసీలు,ఐటీకి తిరుగులేని అడ్డాగా తెలంగాణ..మరింత ముందుకు లైఫ్ సైన్సెస్ 

హైదరాబాద్, వెలుగు:  ఫార్చూన్‌‌‌‌‌‌‌‌ 500 కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. రాష్ట్రానికి భారీగా గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించేలా డిసెంబర్​ 7,8,9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్​ సమిట్‌‌‌‌‌‌‌‌కు సమగ్ర యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శరవేగంగా సిద్ధం చేస్తున్నది. కేవలం పెట్టుబడుల పరిమాణమే కాకుండా, వీలైనన్ని ఎక్కువ అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రంలో భాగస్వాములుగా చేర్చుకోవడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.

ఇందుకోసం ఏరోస్పేస్, సెమీకండక్టర్లు, లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌లాంటి మొత్తం 14 ప్రాధాన్యత రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రతి రంగానికి ఒక స్పష్టమైన పాలసీ, నిర్దిష్ట ల్యాండ్ బ్యాంక్, గడువుతో కూడిన చట్టబద్ధమైన క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అమలు చేసేందుకు కార్యాచరణను ఖరారు చేశారు. 

జీసీసీలు, ఐటీకి తిరుగులేని అడ్డాగా..

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), అత్యాధునిక ఐటీ టెక్నాలజీలకు హైదరాబాద్ నగరం తిరుగులేని అడ్డాగా నిలుస్తుండటంతో వీటిని రెట్టింపు చేసేలా సర్కారు వ్యూహం రచించింది. ఇప్పటికే నగరంలో 500కు పైగా జీసీసీలు, 3 లక్షల మంది ఉద్యోగులతో పాటు మొత్తం 9.39 లక్షల మంది ఐటీ శ్రామిక శక్తి కొనసాగుతున్నది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, గోల్డ్‌‌‌‌మన్ శాక్స్, మైక్రాన్, సర్వీస్‌‌‌‌నౌలాంటి సంస్థలు తమ కార్యకలాపాలను నగరంలో వేగంగా విస్తరిస్తున్నాయి.

కృత్రిమ మేధ (ఏఐ), జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ చిప్ డిజైన్ రంగాల్లో కొత్త ప్రాజెక్టులను ఆకర్షించేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద హార్డ్‌‌‌‌వేర్ ప్రోటోటైపింగ్ కేంద్రమైన టీ-వర్క్స్, టీ-హబ్, రిచ్‌‌లాంటి సంస్థల ద్వారా స్టార్టప్‌‌‌‌లకు మార్గదర్శనం చేస్తున్నారు. మరోవైపు డేటా సెంటర్ల రంగంలో 8 నుంచి 10 గిగావాట్ల సామర్థ్యమే లక్ష్యంగా చందన్‌‌‌‌వెల్లీ, భారత్ ఫ్యూచర్ సిటీల్లో వేల ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రాయదుర్గ్‌‌‌‌లో 16 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఇమేజ్ టవర్ ద్వారా ఏవీజీసీ, గేమింగ్ రంగంలో కొత్తగా 30 వేల మందికి ఉపాది దక్కనుంది.  

మరింత ముందుకు లైఫ్‌‌ సైన్సెస్‌‌

ప్రపంచ ఫార్మా రాజధానిగా పేరొందిన తెలంగాణలో లైఫ్ సైన్సెస్ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సర్కారు భారీ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే 2వేలకు పైగా కంపెనీలు, 40కి పైగా అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్ జీసీసీలు, 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఔషధ పరిశోధనల నుంచి క్లినికల్ ట్రయల్స్, ఏపీఐలు, వ్యాక్సిన్లు, బయోలాజిక్స్ తయారీ దాకా సమగ్ర వాల్యూ చైన్ ఇక్కడ అందుబాటులో ఉంది. డాక్టర్ రెడ్డీస్, భారత్ బయోటెక్, అరబిందో, బయోలాజికల్-ఈతోపాటు నొవార్టిస్, రోచ్, సనోఫీ, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్‌‌లాంటి విదేశీ దిగ్గజాలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

దేశంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్ ‘జీనోమ్ వ్యాలీ’, మెడికల్ డివైజెస్ పార్కులతోపాటు సుస్థిరమైన ‘గ్రీన్ ఫార్మా సిటీ’ని సర్కారు ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెస్తున్నది. సీసీఎంబీ, ఐఐసీటీ, నైపర్‌‌‌‌లాంటి పరిశోధనా కేంద్రాలు, 126 ఫార్మసీ కళాశాలలు పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను నిరంతరం అందిస్తున్నాయి. నియోవాంటేజ్, ఆర్‌‌‌‌ఎక్స్ ప్రొపెల్లంట్‌‌లాంటి ప్రైవేట్ భాగస్వాముల ద్వారా తక్షణమే అందుబాటులో ఉండే రెడీమేడ్ ల్యాబొరేటరీలను సిద్ధం చేశారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలోని అంతర్జాతీయ ఫార్మా కార్గో సదుపాయాలు తెలంగాణ ఔషధ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు వేగంగా చేరవేస్తున్నాయి.