హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. న్యూ భారత్ నగర్ కాలనీలోని ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి సుమారు 30 తులాల బంగారం, రూ.6 లక్షల నగదును అపహరించాడు. బాధిత కుటుంబం కొమరవెల్లి దేవస్థానానికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
స్థానిక సమాచారం ప్రకారం, అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో బుర్కా ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంటి తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం ఇంట్లోని బీరువాను తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లాడు. దొంగ దాదాపు గంటపాటు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్న విషయాన్ని తెల్లవారుజామున గుర్తించిన పనిమనిషి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
దీంతో కొమరవెల్లి దేవస్థానం నుంచి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండటంతో పాటు వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో సుమారు 30 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.
మరోవైపు, నిందితుడు ఇంటి తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.
