- పల్లెల్లో పైసల్ లేక పడిపోనున్న కొనుగోళ్లు
- రబీ సాగు సగానికి పైగా తగ్గే ప్రమాదం
- జీఎస్టీ రాబడిలో 20 శాతం వరకు లోటు
- రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కుదేలు
- 20 లక్షల మంది కార్మికుల ఉపాధికి ఎసరు
- బ్యాంకులకు పెరగనున్న మొండి బకాయిలు
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రమైతే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుందని ఆర్థిక నిపుణుల కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వర్షాభావంతో వానకాలం సాగు దెబ్బతినగా, రబీలోనూ సాగు విస్తీర్ణం భారీగా తగ్గే ప్రమాదం ఉందని తెలిపింది. రైతుల ఆదాయం పడిపోతే గ్రామీణ కొనుగోళ్లు తగ్గి వ్యవసాయంతోపాటు పారిశ్రామిక, సేవారంగాలపైనా ప్రభావం పడుతుందని పేర్కొంది.
దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10–10.7 శాతంగా అంచనా వేసిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు 1.5–2 శాతం మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్పత్తి, ఉపాధి, నగదు చలామణి తగ్గడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతోపాటు బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ సంక్షోభాన్ని ముందస్తుగానే అడ్డుకునేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని గ్రామాల్లో మనీ ఫ్లో అయ్యేలా ఉపాధి హామీ పనులతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సర్కారుకు సూచించింది.
వ్యవసాయ అనుబంధ రంగాలకూ దెబ్బ..
ప్రాజెక్టులు, భూగర్భ జలాల్లో నీటిమట్టాలు పడిపోతుండటంతో సాధారణంగా రబీలో సాగయ్యే 70 లక్షల ఎకరాల్లో ఈసారి 30–40 శాతం మేరకే సాగు జరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. నీటి ఆధారిత పంటలు వేయొద్దని వ్యవసాయ శాఖ సూచించడంతో వరి, ఆరుతడి పంటల సాగు తగ్గి దిగుబడులపై ప్రభావం పడనుంది.
ఫలితంగా రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడటంతోపాటు మార్కెట్ యార్డుల్లో పనులు తగ్గి హమాలీలు, డ్రైవర్లకు ఉపాధి దెబ్బతిననుంది. కేవలం వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లోనే 60 శాతానికి పైగా ఉపాధి పొందుతున్నట్లు వెల్లడించింది. రైతుల చేతిలో డబ్బులు తగ్గితే వ్యాపారాల లావాదేవీలూ మందగించనున్నాయి. ఇది యావత్ వాణిజ్య వ్యవస్థపై గొలుసుకట్టు నష్టాలను చూపనుందని ఆర్థిక నిపుణులు నివేదికలో పొందుపరిచారు.
రాష్ట్ర ఆదాయానికి గండి..
గ్రామీణ కొనుగోళ్లు తగ్గితే ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, విలాస వస్తువుల అమ్మకాలు పడిపోయి రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రాబడిలో 15–20 శాతం వరకు లోటు రావచ్చని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం వచ్చినా, రానున్న నెలల్లో వినియోగం తగ్గితే పరిస్థితి మారనుందని పేర్కొంది.
వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఇప్పటికే గతంతో పోలిస్తే 10 శాతం తగ్గాయని, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా అంచనా వేసిన రూ.18 వేల కోట్ల వార్షిక ఆదాయంపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలిపింది. నిర్మాణ రంగం మందగిస్తే సిమెంట్, స్టీల్, ఇటుకలు, హార్డ్‌వేర్ అమ్మకాలు తగ్గి లక్షల కోట్ల వ్యాపారం దెబ్బతిననుంది. ఈ రంగంపై ఆధారపడిన సుమారు 20 లక్షల మంది కార్మికులు, తాపీ మేస్త్రీలు, ప్లంబర్ల ఉపాధి అనిశ్చితిలో పడనుంది. పరిశ్రమల ఉత్పత్తి తగ్గితే బ్యాంకు రుణాల రికవరీలు దెబ్బతిని ఎన్పీఏలు పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది.
డీబీటీతో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి..
ఉపాధి హామీ పథకం కూలీ డబ్బులు నిత్యావసరాలకే సరిపోతాయని, గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ పెంచేందుకు అవి చాలవని నిపుణుల కమిటీ తెలిపింది. రైతులు, కౌలు రైతులు, గ్రామీణ చేతివృత్తుల వారి చేతుల్లోకి నేరుగా డబ్బులు చేరేలా డీబీటీ ద్వారా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సిఫార్సు చేసింది. గ్రామాల్లో నగదు చలామణి పెంచేందుకు ఉపాధి హామీ పనులను విస్తరించాలని సూచించింది. ఈ అంశం రానున్న కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానుంది.
ఇయ్యాల అఖిలపక్ష భేటీ
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై చర్చించేం దుకు ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ సెక్రటేరియెట్‌లో భేటీ జరగనుంది.
ప్రజలు, రైతులపై కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటికి విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై పార్టీల నేతల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. కరువు నివారణకు అవసరమైన ముందస్తు చర్యలపైనా అభిప్రాయాలు సేకరించనున్నారు.
