నవంబరు 4లోగా  డీఎస్సీ-2002 ..ఉత్తర్వులు అమలు చేయాలి : హైకోర్టు

నవంబరు 4లోగా  డీఎస్సీ-2002 ..ఉత్తర్వులు అమలు చేయాలి : హైకోర్టు
  •  లేకుంటే  సీఎస్‌ వ్యక్తిగత హాజరు తప్పదు
  •  విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా కూడా హాజరుకావాలన్న హైకోర్టు

హైదరాబాద్‌, వెలుగు: డీఎస్సీ–2002 హిందీ పండిట్‌ గ్రేడ్‌–2 నియామకాల వివాదంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నవంబరు 4లోగా అమలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువులోగా అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా కూడా అదే రోజు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. జస్టిస్‌ పి.శ్యామ్‌ కోశీ, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.

డీఎస్సీ–2002లో తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని, తమకు న్యాయం చేయాలని కె.సంధ్య తదితరులు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. వారి నియామకాలను పరిగణనలోకి తీసుకొని 2002 నుంచి సీనియారిటీ కల్పించాలని 2010లో ట్రైబ్యునల్‌ ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అభ్యర్థుల వినతులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని 2022లో హైకోర్టు ఆదేశించినా అమలు కాలేదు. దీంతో బాధితులు 2025లో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

విద్యాశాఖ, ఆర్థిక శాఖ ఆమోదించిన ప్రతిపాదనలు సీఎస్‌ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయని యోగితారాణా కోర్టుకు తెలిపారు. మరింత గడువు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించలేదు. ఉత్తర్వులు అమలు చేయకపోతే సీఎస్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.