రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు సాయంత్రం 5 గంటల కల్లా ముగించాలి
రాంలీలా మైదానం దాటి మార్చ్ చేయొద్దు
రాత్రి బస వద్దు..ఉల్లంఘిస్తే అనుమతి రద్దు
నవంబర్ 1న ‘ఓట్ బచావో..’ పేరుతో ర్యాలీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో తలపెట్టిన మెగా ర్యాలీకి ఢిల్లీ పోలీసులు షరతులతో అనుమతి ఇచ్చారు. కులం, మతం, చర్మం రంగు ఆధారంగా ప్రజల మధ్య ఉద్రిక్తతలు రేకెత్తించేలా, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా వేదికపై నుంచి ఎలాంటి ప్రసంగాలు చేయరాదని పోలీసులు ఆదేశించారు.
ఎవరైనా వక్త రెచ్చగొట్టే లేదా బెదిరింపు ప్రసంగం చేస్తే, నిర్వాహకులు వెంటనే మైక్ ఆఫ్ చేసి ఆ వ్యక్తిని వేదిక నుంచి దించేయాలని స్పష్టం చేశారు. ర్యాలీ సమయంలో రాంలీలా మైదానం నుంచి మరే ప్రాంతానికి మార్చ్ చేపట్టేందుకు అనుమతి లేదన్నారు. ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ పేరుతో జరగనున్న ఈ ర్యాలీని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించుకోవచ్చని పోలీసులు జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ)లో పేర్కొన్నారు.
అయితే స్థల యజమాని అయిన సంస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడంతో పాటు పోలీసులు విధించిన నిబంధనలన్నీ పాటించాలని స్పష్టం చేశారు. సాయంత్రం 5 గంటలకల్లా ర్యాలీ ముగించి, వెంటనే జనం వెళ్లిపోయే ప్రక్రియ మొదలుపెట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమయం పొడిగించేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు.
ర్యాలీకి ముందు గానీ, తర్వాత గానీ రాంలీలా మైదానంలో రాత్రి బస చేయడానికి అనుమతి లేదన్నారు. ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులే బాధ్యత తీసుకోవాలని, హింస, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ర్యాలీ అనుమతిని రద్దు చేస్తామని ఎన్ఓసీలో స్పష్టం చేశారు.
సీసీటీవీ నిఘా, వాలంటీర్లు
ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, వేదిక, సీటింగ్ ప్రాంతాలు, పరిసరాల్లో హై డెఫినిషన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రికార్డింగ్ సౌకర్యంతో కనీసం ఐదు మానిటర్లు ఉన్న కంట్రోల్ రూమ్ పెట్టాలని పోలీసులు ఆదేశించారు. సభకు వచ్చేవారికి సరిపడా వాటర్ ట్యాంకర్లు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, మహిళలకు ప్రత్యేక టాయిలెట్ బ్లాకులు ఉండాలని సూచించారు. ర్యాలీ క్రమపద్ధతిలో జరిగేందుకు తగినంత మంది వలంటీర్లను నియమించాలని, వారంతా ఒకే రకమైన డ్రెస్ కోడ్ లేదా బ్యాడ్జీలతో గుర్తించేలా ఉండాలని పేర్కొన్నారు.
ర్యాలీకి వచ్చే బస్సులు, కార్లు, టెంపోలు ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే పార్క్ చేయాలన్నారు. ఆహ్వానితులు, వలంటీర్ల జాబితా, నిమిష నిమిషానికి కార్యక్రమ షెడ్యూల్, వచ్చే బస్సుల సంఖ్య, వాటి రిజిస్ట్రేషన్ వివరాలను ముందుగానే పోలీసులకు అందజేయాలని ఆదేశించారు. నిర్వాహకులు అన్ని చట్టాలు, నిబంధనలు పాటిస్తూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, సభకు వచ్చే జనాన్ని నియంత్రించి శాంతిభద్రతలు కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
