- రేపు ఢిల్లీలో కర్టెన్ రైజర్ సక్సెస్ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- గ్లోబల్ సమిట్ కార్యక్రమాలపై దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ తో రాష్ట్ర ప్రతిష్ఠ ప్రపంచ స్థాయిలో మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభంకానున్న గ్లోబల్ సమిట్ కార్యక్రమాలపై బుధవారం తన నివాసంలో సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 29న దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమిట్ నిర్వహణకు సంబంధించిన అన్ని ప్రణాళికలను నవంబర్ మొదటి వారంలోగానే పక్కాగా ఖరారు చేసుకోవాలని స్పష్టం చేశారు. సదస్సుకు పలు దేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్న అంతర్జాతీయ సంస్థల సీఈవోలు, ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సమిట్ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో ఔత్సాహిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు రక్షా ఎక్స్ పో, ఇండియా జాయ్ ఈవెంట్లను సమన్వయం చేయాలని సీఎం ఆదేశించారు. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) రంగానికి సంబంధించి ప్రత్యేకంగా చేస్తున్న ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు. టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన వివిధ ప్రముఖుల గురుంచి హైదరాబాద్ నగరవ్యాప్తంగా విస్తృత ప్రచార ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. నగరంలోని పలు చోట్ల వినూత్నంగా డ్రోన్ ఆధారిత ప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టాలన్నారు. ప్రస్తుత ప్రపంచంలో అత్యంత కీలకమైన క్లైమేట్ చేంజ్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలకు సంబంధించిన ప్రపంచ స్థాయి ప్రముఖులను గుర్తించి, వారిని గ్లోబల్ సమిట్కు ఆహ్వానించాలని అధికారులకు స్పష్టం చేశారు.
తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా..
గ్లోబల్ సమిట్ ఆవరణలో తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా డిజైన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా చారిత్రక కాకతీయ కళా తోరణం, రామప్ప ఆలయం డిజైన్లకు ప్రాముఖ్యతను ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగ గురించి అతిథులు స్పష్టంగా తెలుసుకునేలా ప్రత్యేకంగా డిజైన్లు, ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ డి. అనుదీప్ తదితరులు పాల్గొన్నారు
