- సొంత టీమ్‌పై సీఎస్ కసరత్తు
- ‘సర్’ ప్రక్రియ ముగియగానే ఉత్తర్వులు
- పనిచేయని ఆఫీసర్లకు లూప్‌లైన్ పోస్టులు
- దానకిశోర్ రిటైర్మెంట్.. జయేశ్ రంజన్ వీఆర్ఎస్!
- రెండేండ్లు దాటిన కలెక్టర్లకు స్థానచలనం?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో త్వరలోనే భారీ మార్పులు జరగనున్నాయి. కీలక శాఖల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను భారీగా బదిలీ చేసేందుకు సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే నెల 9న ‘సర్’ ప్రక్రియ ముగిసి ఫైనల్ ఓటర్ల జాబితా వచ్చిన వెంటనే బదిలీల ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సీఎంవో, జీఏడీ ఐఏఎస్‌ల జాబితాను జల్లెడ పడుతున్నారు.
ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేండ్లు కావొస్తున్నా.. కొన్ని విభాగాల్లో పనుల వేగం సరిగా లేదని ప్రభుత్వం భావిస్తున్నది. 4 నెలల కిందట బాధ్యతలు తీసుకున్న సీఎస్.. పాలనను గాడిన పెట్టేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో పంచాయతీరాజ్స్పెషల్ సీఎస్ దాన కిశోర్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు.
మరోవైపు ఐటీ, పరిశ్రమల శాఖల్లో ఎక్కువ కాలం పనిచేసి, ప్రస్తుతం ఎంఏయూడీ స్పెషల్ సీఎస్‌గా ఉన్న జయేశ్ రంజన్ తనకు ఇంకా 11 నెలల సమయం ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం అప్లై చేసుకున్నారు. ఈ ఇద్దరు సీనియర్ అధికారుల స్థానాలను భర్తీ చేయడంతో పాటు పాలనను వేగంగా ముందుకు నడిపించేందుకు సీఎస్ తన సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వేగంగా పనిచేసే అధికారులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.
ముఖ్యమైన విభాగాలకు కొత్త హెచ్‌వోడీలు
రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన విభాగాలకు కొత్త హెచ్‌వోడీలను ఎంపిక చేసే పనిలో సీఎం, సీఎస్ నిమగ్నమయ్యారు. మున్సిపల్, రెవెన్యూ, హెల్త్, విద్యా శాఖ, సంక్షేమ శాఖలకు ఎవరిని నియమిస్తే బాగుంటుందనే దానిపై చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారుల పనితీరు, ఫైళ్లను పరిష్కరించే వేగంపై ఇంటిలెజెన్స్ వివరాలు సేకరించింది.
సీఎస్‌గా ఉన్న సంజయ్ జాజు పరిశ్రమల శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. శాఖను తనతో కొనసాగించాలా? అదనంగా ఎవరికైనా ఇవ్వాలా?, లేక వేరే సీనియర్ అధికారిని తీసుకురావాలా? అని ఆలోచిస్తున్నారు. దాన కిశోర్ రిటైర్ అవుతుండటంతో పంచాయతీరాజ్‌శాఖకు అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు.
అయితే, గత మూడేండ్లుగా మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖల్లో పనిచేసిన అనుభవం, వేగంగా పనిచేస్తుండటంతో దాన కిశోర్‌ను రీఅపాయింట్ చేసే అంశం కూడా ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నది. ఆర్అండ్బీ స్పెషల్ సీఎస్‌గా ఉన్న వికాస్ రాజ్‌కు సైతం మరింత ప్రాధాన్యత పోస్టు ఇస్తారని తెలుస్తున్నది. ఇక మున్సిపల్, రెవెన్యూ, విద్య, వైద్య, సంక్షేమ శాఖల్లో కొత్త బాస్‌లను ఎంపిక చేయనున్నట్టు తెలిసింది. విద్యుత్, వ్యవసాయ శాఖల విషయంలోనూ ఐఏఎస్‌లను మార్చనున్నట్టు సమాచారం. రాబోయే పాలనా అవసరాలకు తగ్గట్టుగా సీఎస్ అన్ని శాఖలకు కొత్త అధికారుల పేర్లను సిద్ధం చేసి సీఎం ముందు ఉంచినట్టు తెలుస్తున్నది.
తీరుమారని అధికారులు ప్రాధాన్యం లేని పోస్టులకు..
కొన్ని శాఖల్లో ఆశించిన స్థాయిలో పనులు జరగకపోవడంపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారు. గతంలో సూచనలు చేసినా పనితీరు మార్చుకోని అధికారులను ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేయాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వెనుకబడిన అధికారుల జాబితాను సీఎం కార్యాలయం పరిశీలిస్తున్నది. మరోవైపు బదిలీల వార్తలు రావడంతో మంచి శాఖలను దక్కించుకునేందుకు పలువురు ఐఏఎస్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
తమకున్న పరిచయాలు, సీనియారిటీని చూపుతూ మంత్రుల ద్వారా సిఫార్సులు చేయించుకుంటున్నారు. మరికొందరు ఢిల్లీ స్థాయి పరిచయాలతో కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, ఈసారి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా కేవలం పనితీరు, అనుభవం ఆధారంగానే శాఖలను కేటాయించాలని సీఎం భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు తగ్గట్టుగా వేగంగా పనిచేసే వారికే ప్రాధాన్య పోస్టులు దక్కుతాయని సెక్రటేరియెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రెండేండ్లకు పైగా ఉంటే బదిలీ
జిల్లాల పరిపాలనలో కూడా పెద్ద ఎత్తున మార్పులు జరగనున్నాయి. రెండేళ్లకుపైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న కలెక్టర్లను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుంచి వచ్చే ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించే యువ అధికారులకు జిల్లాల బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు.
ప్రభుత్వం పథకాల అమలు, ఇందిరమ్మ ఇండ్లు, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యటనలు, గురుకులాల విజిట్, భూ సమస్యలు, వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, కరువు, అకాల వర్షాలు, ధాన్యం కొనుగోళ్లలాంటి అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి నిర్ణయాలు తీసుకునే వారికే కలెక్టర్లుగా అవకాశం ఇవ్వనున్నారు.
క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు త్వరగా చేర్చడంలో కలెక్టర్ల పాత్ర కీలకం కాబట్టి.. వారి ట్రాక్ రికార్డును క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే జిల్లాలకు పంపాలని నిర్ణయించింది. సీఎంవో, జీఏడీ సిద్ధం చేస్తున్న తుది జాబితా ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉంది. సీఎస్ ఏర్పాటు చేస్తున్న కొత్త బృందంలో ఎవరెవరికి ముఖ్యమైన శాఖలు వస్తాయి? ఎవరు సాధారణ పోస్టులకు వెళ్తారు? అనే విషయంపై త్వరలోనే స్పష్టత రానున్నది.
