- ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు
- రైతుల రుణాల రీషెడ్యూల్, ఇన్‌పుట్ సబ్సిడీ, రుణ రికవరీలపై ఆంక్షలు విధిస్తూ సర్కారు ఉత్తర్వులు
- ఆరు నెలల పాటు అమలు చేస్తున్నట్టు ప్రకటన జారీ
- రాష్ట్రంలోని జలాశయాల్లో మిగిలింది 179.63 టీఎంసీలే
- వారంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివేదిక
- 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం
- అదనపు కరెంట్, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఎల్నినో ప్రభావంతో 31 జిల్లాల పరిధిలోని 365 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 111 మండలాలను ‘తీవ్ర కరువు’ ప్రాంతాలుగా, మరో 254 మండలాలను ‘మధ్యస్థ కరువు’ ప్రాంతాలుగా వర్గీకరించింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ‘నేషనల్ మాన్యువల్ ఫర్ డ్రాట్ మేనేజ్‌మెంట్’ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో సర్వే నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేసినట్లు సీఎస్ వెల్లడించారు. ఈ కరువు నోటిఫికేషన్ గెజిట్ విడుదలైన తేదీ నుంచి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా అవసరమైతే మరిన్ని మండలాలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.
సహాయక చర్యల కోసం కలెక్టర్లకు ఆదేశాలు
కరువు ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, రైతులకు రుణాల రీషెడ్యూల్, ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదలైన నెల రోజుల్లోగా అర్హులైన రైతులందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పద్ధతిలో బ్యాంక్ ఖాతాల్లోకే ఇన్‌పుట్ సబ్సిడీ జమచేయాలని వ్యవసాయ శాఖకు స్పష్టం చేశారు.
లబ్ధిదారుల జాబితాలను వెబ్‌సైట్లలో పారదర్శకంగా ఉంచాలని సూచించారు. తాగునీటి సరఫరాను యుద్ధప్రాతిపదికన మెరుగుపరచాలని, అవసరమైన చోట పశుగ్రాస కేంద్రాలు, పశువుల శిబిరాలు (క్యాటిల్ క్యాంప్స్) తెరవాలని ఆదేశించారు. బ్యాంకర్ల రాష్ట్రస్థాయి కమిటీ తో సమావేశమై రైతులకు సంబంధించిన వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేయాలని, ఎలాంటి బలవంతపు రుణ వసూళ్లు చేపట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేస్తూ లబ్ధిదారులు, నిధుల వ్యయానికి సంబంధించిన సమగ్ర రికార్డులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు సంక్షోభంపై సెప్టెంబర్ 18న శాసనసభలో ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించినట్లు సీఎస్ నోటిఫికేషన్‌లో గుర్తుచేశారు.
ఎల్-నినో ముప్పుతో అల్లాడుతున్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి తక్షణమే కేంద్ర బృందాన్ని పంపాలని, ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేటాయించడంతో పాటు ఎస్డీఆర్ఎఫ్ వాటాను వెంటనే విడుదల చేయాలని అసెంబ్లీ కేంద్రాన్ని కోరిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ, తాగునీరు, పశుగ్రాసం, భూగర్భ జలాల పునరుద్ధరణ పనులకు అవసరమైన సాయం అందించాలని విజ్ఞప్తి చేసిందన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అదనంగా 50 రోజుల పనిదినాలను కల్పించాలని, ఆ పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలని తాజా నోటిఫికేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సాగు సంక్షోభం దృష్ట్యా వ్యవసాయ రంగానికి రాయితీపై ఎరువులు, అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక కరవు సహాయ ప్యాకేజీ కింద రూ.20,000 కోట్లను మంజూరు చేయాలని, 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్‌బీఎం రుణ పరిమితిని జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని అసెంబ్లీ తీర్మానంలోనే కోరినట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
అవసరమైతే సప్లిమెంటరీ నోటిఫికేషన్
కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అభ్యర్థిస్తూ రాష్ట్ర ప్రణాళికా విభాగం వారం రోజుల్లోగా మెమోరాండం తయారు చేసి రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ద్వారా కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర హోంశాఖలకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. తీవ్ర కరవు నెలకొన్న మండలాలకు సంబంధించిన విలేజ్ లెవల్ గ్రౌండ్ ఫీల్డ్ డేటా, ట్రిగ్గర్-2 మ్యాట్రిక్స్ వివరాలను ఈ రిపోర్టుకు జతచేయాలని స్పష్టంచేసింది.
మున్సిపల్, పట్టణ ప్రాంతాలను కరవు గ్రామాల జాబితా నుంచి మినహాయించినప్పటికీ, తాగునీటి ఎద్దడి విషయంలో వాటిని కూడా కరువు మండలాలతో సమానంగా పరిగణించి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో చోటుదక్కని మండలాలను స్టేట్ డ్రాట్ మానిటరింగ్ సెల్ నిరంతరం పర్యవేక్షిస్తుందని, క్షేత్రస్థాయి వర్షపాతం, పంట పరిస్థితులను బట్టి అవసరమైతే తదుపరి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా కొత్త మండలాలను కరువు జాబితాలో చేర్చుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గ్రామాల్లో స్పష్టంగా కరువు ఛాయలు..
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల సీజన్ లో (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) సాధారణం కంటే తీవ్రమైన లోటు నమోదైనట్లు నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఎల్-నినో ప్రభావం బలపడడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఆశించిన స్థాయిలో ఏర్పడకపోవడం, సుదీర్ఘ డ్రైస్పెల్స్ (వర్షాలు లేని రోజులు) ఏర్పడడం వల్ల రాష్ట్రం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని తెలిపింది. సాధారణ వర్షపాతం 740.6 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, కేవలం 615.5 మిల్లీమీటర్ల వాన కురిసి మైనస్ 17 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను 18 జిల్లాలు పూర్తి వర్షాభావ లోటును ఎదుర్కొంటున్నాయని, దీని ప్రభావం జలాశయాల నీటి నిల్వలపై తీవ్రంగా పడిందని గుర్తుచేసింది. రాష్ట్రంలోని మేజర్, మీడియం రిజర్వాయర్ల పూర్తి నిల్వ సామర్థ్యం 585 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 179.63 టీఎంసీల మేరకే లైవ్ స్టోరేజీ మిగిలి ఉన్నట్లు స్పష్టంచేసింది. భూగర్భ జలాలు సైతం అగాథానికి పడిపోవడంతో గ్రామాల్లో కరవు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడించింది.
కరువు నిర్ధారణ ఇలా
కరువు తీవ్రతను నిర్ధారించేందుకు శాస్త్రీయంగా ఆటోమేటెడ్ వర్షపాత డేటా (ట్రిగ్గర్-1), వ్యవసాయ శాఖ పంట విస్తీర్ణ వివరాలు, రిమోట్ సెన్సింగ్ (వెజిటేషన్ కండిషన్ ఇండెక్స్), ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ అందించిన నేల తేమ వివరాలు, భూగర్భ జలాల సూచీలను (ట్రిగ్గర్-2) ప్రాతిపదికగా తీసుకున్నట్లు సీఎస్ తెలిపారు.
వీటికి తోడు మండలాల్లోని 10 శాతం గ్రామాల్లో విస్తృతంగా శాంపిల్ గ్రౌండ్ ట్రూతింగ్ సర్వేలు నిర్వహించి పంట నష్టాన్ని కచ్చితంగా అంచనా వేసినట్లు చెప్పారు. 75 శాతానికి పైగా సాగునీటి సౌకర్యం ఉన్న ఆయకట్టు మండలాల్లోనూ నిబంధనల ప్రకారం కరువు తీవ్రతను గుర్తించినట్లు వెల్లడించారు.
