- 108 టీఎంసీలకు చేరిన ప్రాజెక్టు నిల్వ
- ఎగువన వర్షాలతో కర్నాటక ప్రాజెక్టులకు జలకళ
- మరో రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండే చాన్స్
- ఆ తర్వాతే శ్రీశైలం వైపు
- ప్రస్తుతానికి వెలవెలబోతున్న మన ప్రాజెక్టులు
హైదరాబాద్, వెలుగు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరదలు మొదలయ్యాయి. దీంతో కర్నాటకలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. అత్యంత కీలకమైన ఆల్మట్టికి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఇదే స్థాయిలో వరదలు కొనసాగితే మరో రెండు, మూడు రోజుల్లో ఆ ప్రాజెక్టు నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్మట్టి సామర్థ్యం 129.72 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 107.92 టీఎంసీల నీళ్లున్నాయి.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఆల్మట్టికి 92.36 టీఎంసీల నీళ్లు వచ్చాయి. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులోకి 65,752 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతున్నది. 38,067 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఇటు నారాయణపూర్ జలాశయంలోకి కూడా వరద ప్రవాహం కొనసాగుతున్నది. 33405 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఆ ప్రాజెక్టులో రికార్టయింది. ఆ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 28.06 టీఎంసీల నీళ్లున్నాయి. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు 10.48 టీఎంసీల నీళ్లొచ్చాయి. తుంగభద్ర ప్రాజెక్టులోకి కూడా స్వల్ప ప్రవాహాలు వస్తున్నాయి. 21 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఆ ప్రాజెక్టు సామర్థ్యం 105.79 టీఎంసీలకుగానూ.. ప్రస్తుతం 28 టీఎంసీలున్నాయి.
చిగురిస్తున్న ఆశలు..
తుంగభద్ర మినహా కర్ణాటకలోని కృష్ణా ప్రాజెక్టులు దాదాపు నిండిపోతున్నాయి. ఈ వారంతోపాటు ఆగస్టులో వరుసగా ఒకటి, రెండు రోజులు గట్టి వర్షాలు పడితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద వచ్చే అవకాశముంది. దీనిపై మన రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతానికైతే వరదల్లేక శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులూ బోసిపోయాయి. గోదావరి బేసిన్లో ప్రాణహిత తప్ప.. ప్రధాన నదికి చుక్క వరద రాలేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వారం రోజుల్లోనైనా మనకు వరదలు మొదలుకాకుంటే తిప్పలు తప్పవని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 137 టీఎంసీలు, శ్రీశైలంలో 41 టీఎంసీల జలాలున్నాయి. లోకల్ క్యాచ్మెంట్ ఏరియాల ద్వారా సాగర్‌లోకి 19 టీఎంసీలు, శ్రీశైలంలోకి 6 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇప్పటికే డెడ్‌స్టోరేజీకి చేరింది. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టులో ఇప్పుడున్నది 15 టీఎంసీల నీళ్లే. ప్రాజెక్టుల్లోని నీటిని కేవలం తాగు అవసరాలకే వాడాలని, సాగు కోసం వాడొద్దని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. జులైలోనే స్కివమ్ మీటింగ్ పెట్టి.. ఆయకట్టు వివరాలను వెల్లడించాల్సి ఉన్నా ప్రాజెక్టుల్లో నీళ్లు అందుబాటులో లేకపోవడంతో ఆయకట్టుపై ఈ ఏడాది డిస్కషన్ చేయలేదు. కాగా,, ఆగస్టులో వరదలను బట్టి స్కివమ్ మీటింగ్‌ను మరోసారి నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా సాగునీటి సరఫరాపై నిర్ణయం తీసుకోనున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2662 క్యూసెక్కుల వరద
బాల్కొండ,వెలుగు: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గురువారం 2662క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఏఈ రవి తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి గరిష్ట ఇన్ ఫ్లో ఇదే.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00అడుగులు,80.31టీఎంసీలు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్టు లో 1064.70 అడుగులు, 15.671టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆఫీసర్ల రికార్డులు తెలుపుతున్నాయి. గడిచిన 24 గంటల సగటున 2662 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 751 క్యూసెక్కులుగా ఉంది.కాకతీయ కెనాల్ కు 250 క్యూసెక్కులు,ఎస్కేప్ గేట్ల ద్వారా 50 క్యూసెక్కులు,మిషన్ భగీరథ కు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.ఆవిరి ద్వారా 220 క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది.గతేడాది ఇదే రోజు 1068.70 అడుగులు,21.199 టీఎంసీల నీరు ఉంది. ఈ ఏడాది గతేడాదితో పోలిస్తే 4 అడుగులు, 5.528 టీఎంసీలు తక్కువగా ఉంది.జూన్ 1నుండి ఇప్పటివరకు మొత్తం ఇన్‌ఫ్లో 3.221టీఎంసీలు,అవుట్‌ఫ్లో 3.833 టీఎంసీలుగా ఉంది.
