విరాట్ కోహ్లీతో గొడవ.. చివరకు మౌనం వీడిన ట్రావిస్ హెడ్!

విరాట్ కోహ్లీతో గొడవ.. చివరకు మౌనం వీడిన ట్రావిస్ హెడ్!

Kohli vs Head: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య మే 22వ తేదీన జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌ల మధ్య చోటు చేసుకున్న హ్యాండ్‌షేక్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్ షేకండ్ ఇచ్చేందుకు ముందుకు రాగా, కోహ్లీ అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన జరిగి కొన్ని నెలలు గడిచిన అనంతరం ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించాడు.

సరిదిద్దుకోవడానికి ఏమీ లేదు: హెడ్
కోడ్ స్పోర్ట్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీతో తనకు ఎలాంటి గొడవలు లేవని తేల్చి చెప్పారు. ఆ రోజు గ్రౌండ్ లో జరిగిన ఘటన ఆటలో ఒక భాగమేనని, ఇందులో వింతగా భావించాల్సింది ఏమీ లేదన్నారు. మా ఇద్దరి మధ్య మళ్లీ సరిదిద్దుకోవడానికి ఏం లేదన్నారు. టోర్నీ జరిగిన తీరు, స్టేడియంలో జరిగిన విషయాలను బట్టి ఇది చాలా సాధారణమైన పరిణామమే.. కాబట్టి ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏం లేదని ట్రావిస్ హెడ్ వెల్లడించారు. 

మ్యాచ్‌లో అసలేం జరిగింది?: 
మే 22వ తేదీన జరిగిన ఈ మ్యాచ్ రెండు జట్లకు ఎంతో కీలకమైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 255 రన్స్ భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ టాప్-2 స్థానాన్ని ఖాయం చేసుకోవడానికి 182 పరుగులు చేయాల్సి ఉంది. ఈ ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ 11 బంతుల్లో 15 రన్స్ చేసి త్వరగానే నిష్క్రమించాడు. కానీ, మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ, ట్రావిస్ హెడ్‌ల మధ్య మైదానంలో తీవ్ర మాటల యుద్ధం కొనసాగింది. కోహ్లీ అతడిని బౌలింగ్ చేయమంటూ సైగలు చేయడం, హెడ్ కూడా ఏదో అనడంతో వాతావరణం హీటెక్కింది. మ్యాచ్ అనంతరం హెడ్ హ్యాండ్‌షేక్ ఇవ్వడానికి ట్రై చేయగా, కోహ్లీ అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం నెట్టింట తీవ్ర దుమారం రేపింది.

మాట్లాడటానికి నిరాకరించిన వెంకటేష్ అయ్యర్: 
నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్ టీ20 లీగ్ సందర్భంగా ఆర్సీబీ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌ను కూడా జర్నలిస్టులు ఈ వివాదంపై ప్రశ్నించారు. కానీ అతడు చాకచక్యంగా స్పందిస్తూ ఈ గొడవపై మాట్లాడటానికి నిరాకరించాడు. స్టేడియంలో ఆ రోజు అసలేం జరిగిందో నాకు తెలియదు.. ఓపెనర్‌గా బరిలోకి దిగి రన్స్ సాధించడంపైనే నేను మొత్తం దృష్టి పెట్టాను.. నాకు సంబంధం లేని విషయాలపై దృష్టి పెడితే నా ఆట దెబ్బతింటుంది అని వెంకటేష్ వెల్లడించారు.