మెర్సిడెస్-బెంజ్‌కు అమెరికా ఊహించని షాక్ ! చైనా వల్ల కొత్త రూల్స్...?

మెర్సిడెస్-బెంజ్‌కు అమెరికా ఊహించని షాక్ ! చైనా వల్ల కొత్త రూల్స్...?

అమెరికా తీసుకురానున్న కొత్త చట్టం వల్ల ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) తీవ్రంగా దెబ్బతినే ఛాన్స్  కనిపిస్తోంది. అమెరికా మార్కెట్లోకి చైనా కార్ల కంపెనీలు రాకుండా నిషేధాన్ని కఠినం చేసేందుకు రూపొందించిన 'కనెక్టెడ్ వెహికల్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2026' బిల్లుకు యూఎస్ సెనేట్ వాణిజ్య కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఈ చట్టంలోని నిబంధనలు ఏంటంటే 
15% వాటా : చైనా కంపెనీలకు 15% కంటే ఎక్కువ వాటా (ఓనర్షిప్) ఉన్న ఏ కార్ల కంపెనీనైనా అమెరికాలో నిషేధించాలని ఈ బిల్లు చెబుతోంది.

మెర్సిడెస్-బెంజ్‌పై ప్రభావం: మెర్సిడెస్-బెంజ్ కంపెనీలో చైనాకు పరోక్షంగా దాదాపు 20% వాటా ఉంది. ఈ కారణంగా ఈ కొత్త చట్టం వర్తిస్తే, అమెరికాలో బెంజ్ కార్ల అమ్మకాలపై నిషేధం పడే ప్రమాదం ఉంది.

టెక్నాలజీపై బ్యాన్: చైనాలో తయారైన కార్లతో పాటు, అక్కడ తయారు చేసిన సాఫ్ట్‌వేర్, డేటా సిస్టమ్స్, బ్లూటూత్, వై-ఫై, సెల్యులార్ కనెక్టివిటీ వంటి టెక్నాలజీ ఉన్న వాహనాలను కూడా అమెరికా రోడ్లపై అనుమతించరు. వాహనాల ద్వారా అమెరికన్ల వ్యక్తిగత డేటా చైనాకు చేరుతుందనే జాతీయ భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

నేతల వాదనలు & మినహాయింపులు
సెనేటర్ మోరెనో (రిపబ్లికన్): ఈ బిల్లును ప్రవేశపెట్టిన సెనేటర్  మోరెనో మాట్లాడుతూ "ఇది చైనా నుండి అమెరికా ఆటోమొబైల్ రంగాన్ని, కార్మికులను కాపాడుతుంది" అని చెప్పారు. అయితే, మెర్సిడెస్-బెంజ్‌కు 2030 వరకు సమయం ఉంటుందని, అవసరమైతే ఈ నియమం నుండి మినహాయింపులు (Exceptions) పొందే అవకాశం కూడా ఉందని తెలిపారు.

సెనేటర్ టెడ్ క్రూజ్ ఆరోపణలు: కమిటీ చైర్మన్ టెడ్ క్రూజ్ స్పందిస్తూ.. జనరల్ మోటార్స్ (GM)  'కాడిలాక్' బ్రాండ్‌కు పోటీ లేకుండా చేసుకోవడానికి, బెంజ్ కార్లను మార్కెట్ నుంచి తొలగించేలా ఈ నిబంధన కోసం ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. బెంజ్ అమ్మకాలను నిషేధించడాన్ని మేము అంగీకరించలేమని అన్నారు.

జనరల్ మోటార్స్ (GM) స్పందన: ఈ ఆరోపణలను జిఎమ్ ఖండించింది. ఈ చట్టం ఏ ఒక్క కంపెనీని ఉద్దేశించింది కాదని, అమెరికన్ పరిశ్రమలను రక్షించడమే దీని లక్ష్యమని పేర్కొంది.

ఇతర కంపెనీలపై ప్రభావం
జిఎమ్ & ఫోర్డ్: చైనాలో తయారు చేస్తున్న మా కార్ల ఉత్పత్తిని అమెరికాకే తరలించడానికి ఈ కంపెనీలు అంగీకరించాయి.

వేమో (Waymo): గూగుల్ సెల్ఫ్-డ్రైవింగ్ విభాగమైన వేమో, చైనా కంపెనీ 'గీలీ'తో కాకుండా డెట్రాయిట్‌కు చెందిన తయారీదారులతో చేతులు కలిపెందుకు మొగ్గు చూపుతోంది.

పోల్‌స్టార్ & వోల్వో: స్వీడన్‌కు చెందిన 'పోల్‌స్టార్' కంపెనీలో చైనా గీలీకి ఎక్కువ వాటా ఉండటంతో 2027 నుండి అమెరికాలో అమ్మకాలు నిలిపివేయాలని ఒత్తిడి వస్తోంది. 'వోల్వో' కూడా ఈ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటోంది.

మెర్సిడెస్-బెంజ్ ఏమంటోంది?
అమెరికా జాతీయ భద్రతకు సంబంధించి తీసుకొచ్చే చట్టాలకు మేము మద్దతు ఇస్తామని బెంజ్ తెలిపింది. మా వ్యాపారం, ఉద్యోగులు, డీలర్లు, వినియోగదారులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడానికి నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటామని వెల్లడించింది.