WTC Final 2025–27: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్ ఫైనల్ మ్యాచ్ తేదీలు, వేదిక వివరాలను ఐసీసీ (ICC) అధికారికంగా ప్రకటించింది. 2027 జూన్ 9 నుంచి 13 వరకు ఈ ప్రతిష్టాత్మక తుది పోరు జరగనుంది. వరుసగా నాలుగోసారి ఇంగ్లాండ్‌లోనే ఈ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. 2027 ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే, అలాగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభానికి కేవలం ఐదు రోజుల ముందు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
లార్డ్స్ మైదానానికి షాక్:
ఈ సారి క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానానికి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆతిథ్య హక్కులు దక్కలేదు. పిచ్‌పై వచ్చిన కొన్ని విమర్శలు, ఆందోళనల దృష్ట్యా ఐసీసీ ఈసారి లార్డ్స్‌ను పక్కనబెట్టింది. దాంతో లండన్‌లోని ది ఓవల్ (The Oval) మైదానాన్ని ఫైనల్ పోరుకు ఎంపిక చేశారు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ను రెండుసార్లు నిర్వహించిన మొదటి వేదికగా ది ఓవల్ నిలవనుంది. గతంలో 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఇదే మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగింది.
గత ఫైనల్స్ హిస్టరీ:
* 2021 (సౌతాంప్టన్): న్యూజిలాండ్ జట్టు భారత్‌ను ఓడించి తొలి విజేతగా నిలిచింది.
* 2023 (ది ఓవల్): ఆస్ట్రేలియా జట్టు భారత్‌ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది.
* 2025 (లార్డ్స్): ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాను ఓడించి సౌతాఫ్రికా జట్టు విజేతగా నిలిచింది.
* ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2025–27 పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక భారత్ ఫైనల్ చేరుకోవడం కాస్త కష్టతరంగా ఉన్నప్పటికీ, రాబోయే తొమ్మిది నెలల్లో జరిగే పలు సిరీస్‌లతో పాయింట్ల పట్టికలో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.
యాషెస్ షెడ్యూల్ విడుదల:
డబ్ల్యూటీసీ ఫైనల్ తేదీల ప్రకటనతో పాటు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తమ హోమ్ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరగబోయే పురుషుల యాషెస్ సిరీస్ జూన్ 18 నుంచి ఆగస్టు 2 వరకు ట్రెండ్ బ్రిడ్జ్, లార్డ్స్, ఎడ్జ్‌బాస్టన్, సౌతాంప్టన్, ది ఓవల్ వేదికలుగా జరగనుంది. అంతేకాకుండా, దాదాపు 27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్ జట్టు మే 23 నుంచి లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది.
