అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎన్. అశోక్ ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించిన చిత్రం ‘హే చికీతా’ (Hey Chikitha). ధనరాజ్ లెక్కల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇవాళ శుక్రవారం(జూలై 24, 2026న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, కుటుంబ బంధాలు, రైతు జీవితాన్ని కలిపి చెప్పే ప్రయత్నం చేసింది.
కథ
నాగనూరు, లచ్చక్కపేట గ్రామాల మధ్య కథ సాగుతుంది. శివ (అభినవ్ మణికంఠ) చదువు పూర్తిచేయలేక ఊరిలోనే వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటాడు. చిన్నప్పటి నుంచి తన మరదలు చిట్టి (దివిజ ప్రభాకర్)ని ప్రేమిస్తాడు. మరో మరదలు పొట్టి (తన్మయ్ ఖుషి)కి కూడా శివంటే ఎంతో ఇష్టం. అయితే చిట్టి తండ్రి.. రైతుకి తన కూతురిని ఇవ్వనని, ఉద్యోగం చేసే వ్యక్తినే అల్లుడిగా చేసుకుంటానని నిర్ణయించుకుంటాడు.
ఇంతలో ఊరిలో జరిగిన ఓ ఘర్షణలో శివ ఆవేశంతో ఒకరిపై దాడి చేసి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత అతని జీవితం ఎలా మారింది? ప్రేమను గెలుచుకున్నాడా? కుటుంబాలు ఎలా స్పందించాయి? చివరకు రైతు విలువను ఎలా చాటిచెప్పాడు? అన్నదే సినిమా ప్రధాన కథ.
నటీనటుల నటన
శివ పాత్రలో అభినవ్ మణికంఠ సహజంగా నటించాడు. గ్రామీణ యువకుడి పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. చిట్టిగా దివిజ ప్రభాకర్ తన అభినయంతో ఆకట్టుకుంది. పొట్టి పాత్రలో తన్మయ్ ఖుషి కూడా గుర్తుండిపోయే నటన కనబరిచింది. దేవి ప్రసాద్ మరోసారి బలమైన పాత్రలో మెప్పించారు. శివ స్నేహితులుగా నటించిన వారంతా సహజమైన కామెడీ, భావోద్వేగాలతో సినిమాకు బలం చేకూర్చారు.
సినిమా ఎలా ఉంది?
ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయం, గ్రామ వాతావరణం, గణేష్ ఉత్సవాల నేపథ్యంలో కథను మెల్లగా ముందుకు తీసుకెళ్తారు. హీరో-స్నేహితుల కామెడీ, బావా-మరదళ్ల మధ్య వచ్చే సీన్స్ వినోదాన్ని పంచుతాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఘర్షణ కథపై ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్లో ఎమోషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. జైలు నుంచి వచ్చిన తర్వాత శివ ఎదుర్కొనే పరిస్థితులు, ప్రేమ కోసం చేసే పోరాటం, కుటుంబాల మధ్య విభేదాలు కథను ముందుకు నడిపిస్తాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో రైతు విలువ, వ్యవసాయం గొప్పదనం గురించి చెప్పిన సందేశం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.
ALSO READ : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేష్‌కు పవర్‌ఫుల్ రోల్..?
టెక్నీకల్ అంశాలు
దర్శకుడు ధనరాజ్ లెక్కల గ్రామీణ జీవనశైలిని సహజంగా తెరపై చూపించారు. అంజి సినిమాటోగ్రఫీ గ్రామీణ అందాలను అందంగా ఆవిష్కరించింది. చరణ్ అర్జున్ సంగీతం, నేపథ్య సంగీతం కథకు మంచి బలం ఇచ్చాయి. పాటలు సందర్భానుసారంగా ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ చక్కగా ఉంది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయిని పెంచాయి.
