ఇంట్లో ఎప్పుడైనా ఒకటో రెండో బొద్దింకలు కనిపిస్తే మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఇవి చాలా వేగంగా పిల్లల్ని పెట్టేస్తాయి. సాధారణంగా ఇవి గోడల మధ్య, అల్మారాల్లో, ఫ్రిజ్ లేదా మిక్సీల వెనుక దాక్కుంటాయి. ఇంట్లో బొద్దింకల గుడ్లు, వాటి రెట్టలు కనిపించినా లేదా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తున్నా.. ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సమస్య పెద్దదయ్యే లోపే కొన్ని చిన్న చిన్న చిట్కాలతో వీటిని సులభంగా దూరం పెట్టవచ్చు.....
1. వంటగది
బొద్దింకలు ముఖ్యంగా రెండు వస్తువుల కోసం వెతుకుతుంటాయి. ఒకటి ఆహారం, రెండోది నీరు. కిచెన్ ప్లాట్‌ఫారమ్‌పై పడిన అన్నం, పెంపుడు జంతువుల తిండి లేదా కారుతున్న కుళాయిలు వాటికి ఆహారంగా మారుతాయి. అందుకే రాత్రి పడుకునే ముందు వంటగదిని నీట్ గా తుడవాలి. తినేసిన గిన్నెలను రాత్రంతా సింక్‌లో వదిలేయకూడదు. బిస్కెట్లు, స్నాక్స్ వంటి వాటిని గాలి చేరని డబ్బాల్లో దాచాలి. సింక్ కింద భాగం, బాత్రూమ్‌లు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి.
2. బీరువాలో
బిర్యానీ ఆకులకు ఉండే ఘాటైన వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదు. ఇది బొద్దింకలను చంపకపోయినా, అవి ఆ ప్రాంతంలోకి రాకుండా ముక్కుతిప్పేసుకుని పారిపోయేలా చేస్తుంది. అందుకే కొన్ని బిర్యానీ ఆకులను చేత్తో నలిపి.. వంటగది అల్మారాలు, సామాన్లు పెట్టే రాక్‌లు, చీకటి మూలల్లో వేయాలి. ఈ ఆకుల వాసన తగ్గిపోయినప్పుడు వాటి స్థానంలో కొత్త ఆకులను మారుస్తూ ఉండాలి.
3. పుదీనా లేదా వేప నూనె
పుదీనా నూనె, వేప నూనె వాసనలు బొద్దింకలను తరిమికొట్టడానికి బాగా పనిచేస్తాయి. ఒక స్ప్రే బాటిల్‌లో కొన్ని నీళ్లు తీసుకుని, అందులో కొన్ని చుక్కల పుదీనా నూనె లేదా వేప నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే దారులు, సింక్ కింద, ఫ్రిజ్ వెనుక భాగాల్లో స్ప్రే చేయాలి. ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటూ ఈ స్ప్రేలు కొడితే మంచి ఫలితం ఉంటుంది.
►ALSO READ | వేసవి సెలవుల్లో అమ్మకు ఇచ్చిన మాట.. నానమ్మ ఐడియాతో సోనూ నేర్చుకున్న గొప్ప పాఠం..
4. గోడల పగుళ్లు, చిన్న రంధ్రాలు
పైపుల పక్కన, కిటికీలు, తలుపుల సందుల్లో ఉండే చిన్న చిన్న రంధ్రాల గుండా కూడా బొద్దింకలు ఈజీగా ఇంట్లోకి దూరిపోతాయి. ఇందుకు ఇంట్లోని పగుళ్లను 'సిలికాన్ సీలెంట్' లేదా వైట్ సిమెంట్‌తో పూర్తిగా మూసివేయాలి. ముఖ్యంగా డ్రెయినేజీ పైపుల చుట్టూ ఉన్న ఖాళీలను గమనించాలి. బాత్రూమ్, కిచెన్ జాలీలపై సన్నటి మెష్ కవర్లను వాడితే బొద్దింకలు పైపుల నుండి పైకి రాలేవు.
5. హానికరమైన స్ప్రేలు
ఇంట్లో రోజూ పురుగుల మందులు చల్లడం వల్ల మన ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. దానికి బదులు కాక్రోచ్ బెయిట్ స్టేషన్లు, బొద్దింకల ఎరలు లేదా జెల్స్ వాడటం చాలా మంచిది. ఇందుకు మార్కెట్లో దొరికే బొద్దింకల జెల్‌ను ఫ్రిజ్‌ల వెనుక, చెత్తబుట్టల దగ్గర, సింక్‌ల కింద చిన్న చుక్కలుగా పెట్టాలి. ఇవి బొద్దింకలను ఆకర్షిస్తాయి. ఆ జెల్‌ను తిన్న బొద్దింకలు వాటి గూటికి వెళ్లి చనిపోతాయి. వాటి వల్ల మిగతా బొద్దింకలు కూడా నశిస్తాయి. అయితే వీటిని వాడేటప్పుడు పిల్లలకు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.
