ఎండాకాలం రానే వచ్చింది. ఆఖరి పరీక్ష కూడా పూర్తి అయింది. స్కూల్ గేట్ దాటుతున్న సోనూ ముఖంలో వెయ్యి వాట్ల వెలుగు. ఇక పుస్తకాల గోల లేదు. హోంవర్క్ టెన్షన్ లేదు. ఇంటికి వెళ్లగానే బ్యాగును గాల్లోనే విసిరేసి, ‘‘అమ్మా! ఇక నుంచి నా ఇష్టం.. రోజంతా ఆటలే ఆటలు!’’ అని ఆనందంగా కేకలు వేశాడు. అమ్మ చిరునవ్వుతో సోనూ దగ్గరకు వచ్చి, ‘‘సరే నాన్నా, తప్పకుండా ఆడుకో. కానీ, నేను ఒక మాట చెప్తా జాగ్రత్తగా విను. ఈ సెలవుల్లో ఆటలతో పాటు మరెన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఈ సమయంలో నీ గురించి నువ్వు తెలుసుకుని, నీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించు. దానివల్ల భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతావు. అమ్మ మాట వింటావు కదూ! మరి నాకు మాటిస్తావా..’’ అంది సున్నితంగా. ‘‘అలాగేనమ్మా.. నువ్వు చెప్పినట్టు చేస్తాను” అని మాటిచ్చాడు సోను.
ఆ రోజే సోనూ సెలవులు గడపడానికి పల్లెటూరిలో ఉన్న నానమ్మ ఇంటికి బయలుదేరాడు. పచ్చని పొలాలు, చెరువులు, పక్షుల కిలకిలరాగాలతో ఆ ఊరు సోనూకి స్వాగతం పలికింది. నానమ్మకి సోనూ అంటే ఎంతో ఇష్టం. తను అడిగిందల్లా చేసి పెడుతుంది. సోనూ కూడా నానమ్మ దగ్గర గారాలు పోతుంటాడు. అయితే, వాళ్ల నానమ్మ ప్రతిసారి సెలవులకు వచ్చినప్పుడు సోనూని గారాబం చేయడం మాత్రమే కాదు.. కొత్త విషయాలు చెప్తూ, రకరకాల యాక్టివిటీలు నేర్పిస్తూ ఉంటుంది. అలాగే ఈసారి కూడా సోనూకి ఏం నేర్పించాలా? అని ఆలోచించింది. ఒకరోజు సోనూ కింద కూర్చుని బుక్‌లో ఏదో రాస్తూ కనిపించాడు. అప్పుడు సోనూ చేతిరాత చూసిన నానమ్మకి అది అంతగా నచ్చలేదు. దీంతో సోనూకి అందమైన చేతిరాత నేర్పించాలి అనుకుంది. మరుసటి రోజు నుంచి నానమ్మ సోనూని పక్కన కూర్చోబెట్టుకుని ముత్యాల్లాంటి అక్షరాలు రాయించడం మొదలుపెట్టింది. ఇలా ప్రతిరోజూ ఉదయాన్నే సోనూతో రాత ప్రాక్టీస్ చేయించింది. ఆ ప్రాక్టీస్ టైంలో ‘‘సోనూ, అక్షరం అందంగా ఉంటేనే మనిషి ఆలోచనలకు గౌరవం లభిస్తుంది’’ అని చెప్పేది వాళ్ల నానమ్మ. ఆ మాటలు సోనూలో పట్టుదలను పెంచాయి. అలా మంచి చేతిరాత నేర్చుకున్నాడు సోనూ. దాంతో నానమ్మ సోనూకి ఇష్టమైన స్వీట్స్ చేసి పెట్టింది. అవి తింటూనే సోనూ.. ‘‘నానమ్మ రేపటి నుంచి ఏం చేద్దాం? ఇంకా నాకు ఏమేం నేర్పిస్తావు” అని అడిగాడు.
►ALSO READ | ఇంట్లో పెరుగు ఉంటే చాలు.. ఉదయం 5 నిమిషాల్లో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ ఇదిగో!
ఆ మాటలకు నానమ్మ ఇంటి వెనుక పెద్ద మామిడి తోట చూపించి “రేపు తోటలో నీకు పనుంది” అని చెప్పింది. మర్నాడు మధ్యాహ్నం సోనూని తోటలోకి తీసుకెళ్లి, మామిడి పండ్లను చూపిస్తూ, ‘‘సోనూ, ఆ పండ్లను స్వయంగా నువ్వే కోయాలి’’ అంది. సోనూకి మొదట చెట్టెక్కాలంటే భయమేసింది. కానీ నానమ్మ ఇచ్చిన ధైర్యంతో, మెల్లగా ఒక్కో కొమ్మను పట్టుకుంటూ పైకి ఎక్కాడు. ఆ చెట్టుపై నుంచి పండ్లను కోసి కిందకు దిగాక అతనికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ‘‘కష్టపడి సంపాదించిన దాంట్లో ఉండే తీపే వేరు’’ అని చెప్పిన మాట గుర్తొచ్చింది సోనూకి.
అంతటితో ఆగకుండా, ఒకరోజు ఊరిలో జరిగిన చిత్రలేఖనం పోటీలో నానమ్మ నేర్పిన ఏకాగ్రతతో సోనూ పచ్చని ప్రకృతిని అద్భుతంగా గీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఊరిలోని చెరువులో స్నేహితులతో కలిసి పెద్దవాళ్ల పర్యవేక్షణలో ఈత నేర్చుకున్నాడు. నీళ్లపై అతనిలో ఉన్న భయం పోయింది. సెలవులు ముగిసి తిరిగి పట్నం వెళ్లే సమయానికి సోనూ పూర్తిగా మారిపోయాడు. బద్ధకం వదిలి క్రమశిక్షణను, భయం వదిలి ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకున్నాడు. ఇంటికి వెళ్లగానే అమ్మతో సోనూ ‘‘అమ్మా! నేను నీకిచ్చిన మాట నెరవేర్చాను. ఈ సెలవుల్లో నేను జీవితానికి కావాల్సిన ధైర్యాన్ని, నైపుణ్యాన్ని సంపాదించుకున్నా. ఇవి నా జీవితంలోనే మరిచిపోలేని రోజులు” అని ఆనందంగా చెప్పాడు. ఆ మాటలకు వాళ్లమ్మ ‘‘నా బంగారు కొండ!’’ అంటూ నుదుటిపై ముద్దాడింది. సోనూ ఎప్పటినుంచో కావాలంటోన్న సైకిల్‌ను స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి గిఫ్ట్‌గా ఇస్తానని ప్రామిస్ చేసింది. తల్లీకొడుకులిద్దరూ సంతోషంలో మునిగిపోయారు. వాళ్లను చూసి సోనూ తండ్రి, నానమ్మ మురిసిపోయారు.
- యండి. ఉస్మాన్ ఖాన్
