2036 ఒలింపిక్స్‌‌‌‌ బిడ్‌‌‌‌పై భారత్‌‌‌‌ ఫోకస్‌..‌‌‌ వచ్చే రెండేళ్లలో 29 అంతర్జాతీయ టోర్నీలు

2036 ఒలింపిక్స్‌‌‌‌ బిడ్‌‌‌‌పై భారత్‌‌‌‌ ఫోకస్‌..‌‌‌ వచ్చే రెండేళ్లలో 29 అంతర్జాతీయ టోర్నీలు

న్యూఢిల్లీ: 2036 ఒలింపిక్స్‌‌‌‌కు ఆతిథ్యం దక్కించుకునే లక్ష్యంతో భారత్‌‌‌‌ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లలో 29 అంతర్జాతీయ క్రీడా టోర్నీలను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అహ్మదాబాద్‌‌‌‌కు 2030 కామన్వెల్త్ గేమ్స్‌‌‌‌ ఆతిథ్యం దక్కగా, అదే నగరం నుంచి 2036 ఒలింపిక్స్‌‌‌‌, 2038 ఆసియా క్రీడల నిర్వహణ కోసం కూడా భారత్‌‌‌‌ బిడ్‌‌‌‌ దాఖలు చేసింది. 

గత ఏడాది నుంచి దేశంలోని 15 నగరాల్లో 36 అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించిన భారత్‌‌‌‌, 2028 నాటికి మొత్తం 65 ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది నిర్వహించే ప్రధాన టోర్నీల్లో కామన్వెల్త్‌‌‌‌ టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌, ప్రపంచ అమెచ్యూర్‌‌‌‌ స్నూకర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌, ప్రపంచ బ్యాడ్మింటన్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లు ఉన్నాయి. 

వీటితో పాటు ఖండస్థాయి, ప్రపంచస్థాయి మరిన్ని టోర్నీల నిర్వహణ హక్కుల కోసం జాతీయ క్రీడా సమాఖ్యలు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర క్రీడా శాఖ వెల్లడించింది. కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్‌‌‌‌ మాండవీయ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణ భారత క్రీడా వ్యవస్థలో కీలక భాగంగా మారిందన్నారు. 

2030 కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌, 2036 ఒలింపిక్స్‌‌‌‌ బిడ్‌‌‌‌కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే 15 నగరాల్లో ఈవెంట్ల నిర్వహణ ద్వారా వచ్చిన అనుభవం దేశ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని చెప్పారు. అంతర్జాతీయ పోటీలను దేశంలో నిర్వహించడం వల్ల ఆటగాళ్లను విదేశాలకు పంపే వ్యయం గణనీయంగా తగ్గుతోందని, అదే సమయంలో శాశ్వత క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు అధికారులు, వాలంటీర్లకు సాంకేతిక నైపుణ్యం పెరుగుతోందని మాండవీయ తెలిపారు.