న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కుండపోత వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు ముంచెత్తడంతో రోడ్లు నదులను తలపించేలా మారాయి. చాలా ఏరియాల్లో చెట్లు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సదర్ బజార్, గ్రేటర్ కైలాష్, బదర్‌పూర్, నసీర్‌పూర్, తేలీవారా, మహావీర్ బజార్, స్వరూప్ నగర్, కుషాక్ రోడ్, ద్వారకా, వికాస్ మార్గ్, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రాంతాలు నీటమునిగాయి.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రోజంతా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నైరుతి రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు ఉత్తర దిశగా కదలడమే కారణమని తెలిపింది. ఈ వ్యవస్థ మరింత ఉత్తరానికి వెళ్లే వరకు ఢిల్లీలో విస్తృతంగా వర్షాలు పడొచ్చని చెప్పింది. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో 72.6 మిల్లీమీటర్లు, లోధీ రోడ్‌లో 80.2, రిడ్జ్‌లో 77.8, పాలంలో 63, అయానగర్‌లో 57.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.
భవనం కూలి ముగ్గురు మృతి
భారీ వర్షాల కారణంగా రోహిణి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చని భావిస్తున్నారు.
