తహసీల్దార్‌‌ నుంచే మాంగ్ కులానికి సర్టిఫికెట్లు జారీ..సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మాంగ్ నేతలు

తహసీల్దార్‌‌ నుంచే మాంగ్ కులానికి సర్టిఫికెట్లు జారీ..సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మాంగ్ నేతలు

హైదరాబాద్, వెలుగు: మాంగ్ కులానికి క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని ఆర్డీవో నుంచి తహసీల్దార్‌‌కు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మాంగ్ సమాజ్ రాష్ట్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌కు మాంగ్ సామాజిక వర్గ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా మాంగ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు గాయక్వాడ్ తులసీదాస్, ప్రధాన కార్యదర్శి కాంబ్లే శంకర్ గురువారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమ సామాజిక వర్గానికి ఎంతో ప్రయోజనకరమని కొనియాడారు. గతంలో ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇకపై స్థానిక తహసీల్దార్ స్థాయిలోనే సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సులభతరం కానుందని చెప్పారు. దీనివల్ల విద్యార్థులు, యువత అనవసర ఇబ్బందులు పడకుండా, త్వరగా ధృవీకరణ పత్రాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. తమ సమస్యను గుర్తించి సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి వారు అభినందనలు తెలిపారు.