- సర్‌పై కాంగ్రెస్ జూమ్ మీటింగ్‌లో పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్ దిశా నిర్దేశం
హైదరాబాద్, వెలుగు: ‘సర్’ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లు ఎక్కువగా గల్లంతయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ విషయంలో సర్‌పై నియమించిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం జూమ్ మీటింగ్‌లో సర్ ప్రక్రియ సాగుతున్న తీరుపై, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సర్‌పై చర్చించారు. పట్టణ, నగర ప్రాంతాల్లోనే ఎక్కువ శ్రద్ధ చూపాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఓటరును కాపాడుకోవాలని, బూత్‌ల వారిగా జరుగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించాలని కోరారు. ఓటర్ల జాబితా పరిశీలన, అవసరమైన పత్రాల సేకరణ, బీఎల్ఏల పనితీరుపై పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు సమన్వయం చేసుకుంటూ ఉండాలన్నారు. ఎక్కడెక్కడా బీఎల్ఏల పనితీరు సరిగ్గా లేదో గుర్తించి, అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలని మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్ ఆదేశించారు. బూత్ స్థాయిలో పార్టీ నేతల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాలని సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కీలకమైన మండల కమిటీల నియామకం వెంటనే పూర్తిచేయాలని చెప్పారు.
