పోక్సో కేసులో బండి భగీరథ్‌‌కు బెయిల్‌‌

పోక్సో కేసులో బండి భగీరథ్‌‌కు బెయిల్‌‌
  •     రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌‌తో మంజూరు చేసిన హైకోర్టు
  •     సాక్షులను కలవద్దని..ఇంటర్వ్యూలు ఇవ్వద్దని షరతులు

హైదరాబాద్, వెలుగు: పోక్సో కేసులో  బండి సాయి భగీరథ్‌‌కు హైకోర్టు బెయిల్‌‌ మంజూరు చేసింది.  రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌‌తో పాటు అంతే మొత్తానికి ఇద్దరు పూచీకత్తుదారులను సమర్పించాలని స్పష్టం చేసింది. సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటివి చేయరాదని పేర్కొంది.17 ఏండ్ల బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో సాయి భగీరథ్‌‌ పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు  హైకోర్టులో బెయిల్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్‌‌ సుజన గురువారం విచారించారు. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

పిటిషనర్‌‌ 55 రోజులుగా జైలులో ఉన్నారని.. కేసులో 25 మంది సాక్షుల వాంగ్మూలాలు ఇప్పటికే నమోదు చేసినట్టు తెలిపింది. దర్యాప్తు దాదాపు పూర్తయి చార్జిషీట్‌‌ దాఖలు చేయాల్సి ఉందని.. బాధితురాలి స్నేహితుల్లో ఒకరిద్దరి వాంగ్మూలాలు నమోదు కాలేదన్న ఒక్క కారణంతో దర్యాప్తు అసంపూర్తిగా భావించలేమని పేర్కొంది. నిందితుడు దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తాడనే పరిస్థితి కనిపించనప్పుడు అతన్ని నిర్బంధంలో ఉంచాల్సిన అవసరం లేదని తెలిపింది. 

ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు ఎనిమిది వారాలపాటు లేదా చార్జిషీట్‌‌ దాఖలయ్యే వరకు సంబంధిత దర్యాప్తు అధికారిముందు భగీరథ్‌‌ హాజరుకావాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని ఆదేశించింది. బాధితురాలి నివాసం, విద్యాసంస్థ, పనిచేసే ప్రాంతాలకు వెళ్లరాదని, బాధితురాలు, ఫిర్యాదుదారు, సాక్షులతో ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలు పెట్టుకోరాదని షరతు విధించింది. కేసుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం, మెసేజ్‌‌లు, ఆడియోలు, వీడియోలు లేదా ఇతర ఎలక్ట్రానిక్‌‌ సమాచారాన్ని ప్రచారం చేయరాదని స్పష్టం చేసింది. షరతులు ఉల్లంఘిస్తే  బెయిల్‌‌ రద్దు కోసం ప్రాసిక్యూషన్‌‌ దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.