- కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని సల్కం చెరువులో బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ నిర్మాణాల అంశంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఎలా చేపట్టారని అధికారులను ప్రశ్నించింది. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, లేక్ ప్రొటెక్షన్ కమిటీ, పాఠశాల విద్యాశాఖ అధికారులు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సల్కం చెరువును ఆక్రమించి ఓ విద్యాసంస్థ నిర్మాణాలు చేపట్టిందని, ఆక్రమణదారులపై అధికారులు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కోరుతూ న్యాయవాది విజయ్‌గోపాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున విజయ్‌గోపాల్ వాదనలు వినిపిస్తూ.. సల్కం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన విద్యాసంస్థల భవనాలను తొలగించి, సంబంధిత అధికారులను చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని, ఇప్పటికే నోటీసులు జారీ చేసి 90 రోజులైనా అధికారులు స్పందించకపోవడంపై తప్పుబట్టారు.
ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థలు, సాలార్- –ఎ–-మిల్లత్ ట్రస్ట్ తరఫున సీనియర్ న్యాయవాదులు జె.రాంచందర్‌రావు, వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్ దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు లేదని, ఎన్నో ఏండ్ల క్రితమే నిర్మాణాలు పూర్తయితే, ఇప్పుడు పిల్ దాఖలు చేయడమేంటని ప్రశ్నించారు. న్యాయమూర్తి జోక్యం చేసుకొని చెరువుల పరిరక్షణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశమని, అలాంటి విషయాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ప్రశ్నించే హక్కు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువులను రక్షించేందుకే హైడ్రాను ఏర్పాటు చేసిందని, చట్టానికి ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు. అనంతరం నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.
