ఉదయాన్నే ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే హడావుడిలో త్వరగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎం చేయాలి అని ఆలోచిస్తుంటాం.... అలాంటి వారి కోసం నోటికి ఎంతో రుచిని, కడుపుకు హాయిని ఇచ్చే రెండు క్విక్ రెసిపీలు దహీ టోస్ట్ & దహీ ఉప్మా. ఇంట్లోనే ఉండే సింపుల్ పదార్థాలతో వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా....
దహీ టోస్ట్
కావాల్సినవి :
పెరుగు - ఒక కప్పు
పసుపు, మిరియాల పొడి - ఒక్కోటి పావు టీస్పూన్
కారం - అర టీస్పూన్
ఉప్పు - సరిపడా
నెయ్యి - అర టీస్పూన్
పచ్చిమిర్చి - రెండు
వెల్లుల్లి రెబ్బలు - మూడు
తయారీ :
ఒక గిన్నెలో పెరుగు, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. మిక్సీజార్‌లో కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని కూడా పాన్‌లో వేసి బాగా కలపాలి. తర్వాత బ్రెడ్ స్లైస్‌ను అందులో ముంచాలి. మరో పాన్‌లో నెయ్యి వేడి చేసి బ్రెడ్ వేసి రెండు వైపులా కాల్చాలి అంతే.
దహీ ఉప్మా
కావాల్సినవి :
పెరుగు, బొంబాయి రవ్వ - ఒక్కోటి అర కప్పు
పచ్చిమిర్చి - రెండు
అల్లం పేస్ట్ - అర టీస్పూన్
కొత్తిమీర, కరివేపాకు - కొంచెం
ఉప్పు - సరిపడా
నెయ్యి, జీడిపప్పులు - ఒక్కో టేబుల్ స్పూన్
ఆవాలు - పావు టీస్పూన్
మినప్పప్పు, శనగపప్పు - ఒక్కో టీస్పూన్
ఉల్లిగడ్డ తరుగు - ముప్పావు కప్పు
క్యారెట్ తరుగు - రెండు టేబుల్ స్పూన్లు
తయారీ :
ఒక గిన్నెలో పెరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం పేస్ట్, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో నీళ్లు పోసి మరోసారి కలపాలి. పాన్‌లో నూనె, నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పులు, కరివేపాకు వేసి వేగించాలి. అవన్నీ వేగాక ఉల్లిగడ్డ, క్యారెట్ తరుగు వేసి వేగించాలి. అందులో బొంబాయి రవ్వ వేసి కలపాలి. రవ్వ వేగాక రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో పోయాలి. ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. అంతే.. ఐదు నిమిషాల్లో దహీ ఉప్మా తినడానికి రెడీ అయిపోతుంది.
►ALSO READ | యూట్యూబ్‌లో సూపర్ ఏఐ ఫీచర్.. ఇక నోటితో అడిగితే చాలు, కావలసిన వీడియో క్షణాల్లో మీ ముందు!
