వానలు పడట్లే.. నదులు పారట్లే ! రాష్ట్రంలోని 19 జిల్లాల్లో లోటు వర్షపాతం

వానలు పడట్లే..  నదులు పారట్లే ! రాష్ట్రంలోని 19 జిల్లాల్లో లోటు వర్షపాతం
  • హనుమకొండ జిల్లాలో 57, మేడ్చల్​లో 48 శాతం లోటు
  • కృష్ణా నదికి ఇప్పుడిప్పుడే మొదలవుతున్న వరద
  • ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో
  • కర్ణాటక ప్రాజెక్టులు దాటి రావాలంటే నెల రోజులు పట్టే అవకాశం
  • గోదావరిలో కనిపించని వరద, ప్రాణహితకు వస్తున్నా వృథాయే..

హైదరాబాద్, వెలుగు : 
వర్షాకాలం సీజన్ మొదలై నెల రోజులు దాటిపోతున్నా వరుణుడు కరుణించడం లేదు. ఇప్పటివరకు భారీ వర్షాలు పడకపోవడంతో ఓ వైపు సాగుకు ఇబ్బందులు తలెత్తుతుండగా, మరోవైపు వరదలు లేక నదులు వెలవెలబోతున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటివరకు రాష్ట్రంలోని 19 జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. నదులకు ఎగువ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వరద మొదలవుతున్నందున.. ఆ నీరు మన ప్రాజెక్టుల దాకా వచ్చేందుకు మరో నెల రోజులకు పైగా పట్టే అవకాశం ఉంది.

భూమిలోనే మాడిపోతున్న విత్తనాలు
వర్షాలు పడుతాయన్న ఆశతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేసుకున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా గట్టి వాన పడకపోవడంతో దుక్కులు ఎండిపోతుండగా, విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఏ జిల్లాలో చూసినా ఎండిపోయిన దుక్కులే కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు సైతం అడుగంటడంతో బోర్లు, బావుల మీద ఆధారపడిన రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. 

19 జిల్లాల్లో లోటు వర్షపాతమే...
రాష్ట్రంలో ఇప్పటివరకు లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 185.4 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా... 15 శాతం తక్కువగా 156.7 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. రాష్ట్రం మొత్తం సగటు చూస్తే ఫర్వాలేదనిపించినా... జిల్లాల వారీగా చూస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని జిల్లాల్లో స్వల్పంగా అధిక వర్షపాతం నమోదు అయితే.. మరికొన్ని జిల్లాల్లో భారీ లోటు కనిపిస్తోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే కాకుండా.. మండలాలవారీగానూ తేడాలు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మంచి వర్షపాతం నమోదైతే... మరికొన్ని జిల్లాల్లో తీవ్రమైన లోటు ఏర్పడింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలోని 19 జిల్లాల్లో 20 నుంచి 57 శాతం వరకు లోటు వర్షాపాతం నమోదైంది. హనుమకొండ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. 

ఈ జిల్లాలో 202 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా... కేవలం 86 మిల్లీమీటర్లే పడడంతో 57 శాతం లోటు నెలకొంది. ఇక మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో 48 శాతం, వరంగల్​లో 46 శాతం, జోగులాంబ గద్వాలలో 41 శాతం, వనపర్తిలో 35, నిజామాబాద్​ 34, యాదాద్రి భువనగిరిలో 33, వికారాబాద్​లో 30, నారాయణపేటలో 28, జగిత్యాలలో 26, కరీంనగర్​లో 25 మిల్లీమీటర్ల లోటు వర్షాపాతం నమోదైంది. 

అలాగే ఆదిలాబాద్​లో 25, హైదరాబాద్​లో 25, మంచిర్యాలలో 24, జనగామలో 23, సిద్దిపేటలో 22, రాజన్నసిరిసిల్లలో 22, మహబూబ్​నగర్​లో 21, జయశంకర్​ భూపాలపల్లిలో 20 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. వాస్తవానికి మరో ఆరేడు జిల్లాల్లోనూ 10 నుంచి 17 శాతం వరకు లోటు వర్షపాతమే ఉన్నా.. ఆఫీసర్లు సాధారణం కిందే లెక్కిస్తున్నారు.

నదులకు ఇప్పుడిప్పుడే మొదలైన వరదలు
వర్షాలు లేకపోవడంతో నదుల్లో వరద ప్రవాహం కూడా తగ్గిపోయింది. కృష్ణా బేసిన్​లో మాత్రం ఇప్పుడిప్పుడే వరద మొదలవుతోంది. భీమాకు ఎగువన పరివాహక ప్రాంతం, ఆల్మట్టికి ఎగువన, తుంగభద్ర వద్ద ప్రవాహాలు ఇప్పుడే మొదలవుతున్నాయి. ప్రస్తుతం ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, తుంగభద్రలోకి 30 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. అయితే, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రను దాటుకుని శ్రీశైలం, సాగర్ కు వరద రావాలంటే మరో 45 రోజులైనా పట్టే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

ప్రస్తుతం పశ్చిమ కనుమల్లో వర్షాలు జోరుగా పడుతుండండతో వరదల వస్తున్నా... ఆగస్టు, సెప్టెంబర్​లో వర్షాలు తగ్గుతాయన్న అంచనా ఉండండతో వరద రాకపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటు గోదావరిలోనైతే పరిస్థితి మరీ దారుణంగా మారింది. నదిలో చుక్క ప్రవాహం నమోదు కావడం లేదు. కేవలం ప్రాణహితలో మాత్రమే వరద ప్రవాహం కొనసాగుతోంది. గూడెం వద్ద ప్రాణహిత నుంచి లక్ష క్యూసెక్కులకుపైగా వరద కిందకు పోతోంది. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యం కారణంగా ఆ నీటిని వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది.