ప్రతినెలా ఒకటో తారీఖునే జీతాలు ఇవ్వాలి..మెడికల్ కార్మికుల డిమాండ్

ప్రతినెలా ఒకటో తారీఖునే జీతాలు ఇవ్వాలి..మెడికల్ కార్మికుల డిమాండ్
  •     డీఎంఈ ఆఫీస్ ముట్టడి, ఉద్రిక్తత

హైదరాబాద్, వెలుగు: ప్రతినెలా ఒకటో తారీఖున తమకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు డిమాండ్​చేశారు. ఈ మేరకు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. గురువారం కోఠిలోని డీఎంఈ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ యూసుఫ్, ఎం.నరసింహ మాట్లాడుతూ సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించినా తమకు ఒకటో తారీఖున జీతాలు రావడం లేదన్నారు. 

చట్ట ప్రకారం రావాల్సిన సెలవులు, బోనస్ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందిస్తూ వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేతనాల చెల్లింపులో ఎక్కడా జాప్యం జరగకుండా ఐహెచ్ఎఫ్ఎంఎస్ పోర్టల్ పాలసీలో అవసరమైన సవరణలు తక్షణమే చేయాలని చెప్పారు. దీంతో అధికారులు కార్మిక నేతలతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమించారు. ఆందోళనలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.లక్ష్మీబాయి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ హసీనాబేగం, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.