- విదేశీ టూర్లు, అంతర్జాతీయ విద్య, ఏఐ సబ్‌స్క్రిప్షన్లు,
- ప్రీమియం గ్యాడ్జెట్ల కోసం డాలర్ల రూపంలో ఖర్చులు
- 56 కోట్లకు చేరిన మిడిల్‌క్లాస్ జనాభా
న్యూఢిల్లీ: ఇండియాలో మిడిల్‌క్లాస్ ప్రజలు సంపాదిస్తున్నది రూపాయిల్లోనే అయినా, ఖర్చులు మాత్రం డాలర్ల బాట పడుతున్నాయి. విదేశీ టూర్లు, అంతర్జాతీయ విద్య, ఏఐ సబ్‌స్క్రిప్షన్లు, ప్రీమియం గ్యాడ్జెట్ల వంటి వాటికోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. దీంతో దేశీయంగా వినియోగం డాలర్ల ఆధారంగా జరుగుతోందనే కొత్త చర్చ మొదలైంది.
డాలర్ల అవసరం పెరుగుతోందిలా..
1. విస్తరిస్తున్న మిడిల్‌క్లాస్ మార్కెట్
రీసెర్చ్ అనాలసిస్ కంపెనీ ‘ప్రైస్’ రిపోర్ట్ ప్రకారం.. ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ36 లక్షల వరకు సంపాదించే మిడిల్‌క్లాస్ ప్రజల సంఖ్య ఇండియాలో 56 కోట్లకు (12.6 కోట్ల కుటుంబాలకు) చేరింది. ఇదే విభాగం 2030–31 నాటికి 71.5 కోట్లకు, 2046–47 నాటికి 100 కోట్లకు చేరుతుందని అంచనా. ఇంత భారీ జనాభా గ్లోబల్ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు చూపడంతో డాలర్లకు డిమాండ్ పెరుగుతోంది. పదేళ్ల క్రితం వరకు భారతదేశంలో డాలర్ల అవసరం కేవలం ముడిచమురు దిగుమతులు, కార్పొరేట్ అప్పులు, వాణిజ్యానికే పరిమితమయ్యేది. కానీ ప్రస్తుతం విదేశీ విద్య, గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, క్లౌడ్ సాఫ్ట్‌వేర్, విదేశీ ఈ-–కామర్స్ వంటివి నేరుగా కుటుంబాల బడ్జెట్‌లో భాగమయ్యాయి.
2. విదేశీ ప్రయాణాలు
ప్రభుత్వ డేటా ప్రకారం.. 2025లో భారతీయులు రికార్డు స్థాయిలో 3.28 కోట్ల విదేశీ ప్రయాణాలు చేశారు. ఆర్‌బీఐ ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ కింద 2026 ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు పంపిన 29 బిలియన్ డాలర్లలో, ఒక్క ప్రయాణాల కోసమే 16.4 బిలియన్ డాలర్లు ( అంటే సగానికి పైగా) ఖర్చయ్యాయి. థాయిలాండ్, మలేషియా వంటి దేశాలు వీసా లేకుండా ఎంట్రీ ఇవ్వడం, దేశీయంగా ప్రీమియం హోటళ్ల ధరలు పెరగడంతో బ్యాంకాక్ వంటి విదేశీ ప్రాంతాలకు వెళ్లడం మధ్యతరగతికి సులువైంది.
3.అంతర్జాతీయ విద్య, వైద్యం:
ఉన్నత చదువుల కోసం భారతీయులు 2026 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా 2.3 బిలియన్ డాలర్లకు పైగా నేరుగా పంపారు. అలాగే విదేశీ వైద్య సేవలు, చికిత్సల కోసం దాదాపు 61 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేశారు.
4. కంటికి కనిపించని 'డిజిటల్ డాలర్ బిల్లు'
మనం చెల్లించే ఓటీటీలు, యాప్స్, క్లౌడ్ స్టోరేజ్, ప్రీమియం ఏఐ టూల్స్ వంటివన్నీ డాలర్ ధరలతో ముడిపడి ఉన్నవే. 2025లో భారతదేశంలో డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ల వినియోగం 60 శాతం పెరిగి రూ.16,300 కోట్లకు చేరింది. దేశంలో 50 కోట్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు మెటా, గూగుల్ వంటి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లలో సమయాన్ని గడుపుతున్నారు. దీంతో పాటు విదేశీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం పెరిగింది. ఈ ఏడాది మార్చిలోనే భారతీయులు గ్లోబల్ ఈక్విటీలలో 440 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు.
5. దిగుమతుల భారం
మరోవైపు సరుకుల దిగుమతుల రూపంలో కూడా డాలర్ల ఖర్చు భారీగా జరుగుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ముడిచమురు దిగుమతుల బిల్లు 123.37 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బంగారం దిగుమతులు ఏడాది లెక్కన 34శాతం ఎగబాకాయి. ఎలక్ట్రానిక్స్ దిగుమతులు మొదటిసారిగా 116.2 బిలియన్ డాలర్ల మార్కును దాటాయి.
