మీరు బుధవారం రోజు పుట్టారా.... అయితే మీ పుట్టిన రోజుకు బుధ గ్రహం అధిపతి అవుతాడు. బుధవారం పుట్టిన వారి మనస్సు ఎప్పుడూ చాలా చురుకుగా పనిచేస్తూనే ఉంటుంది. చుట్టూ అంతా ప్రశాంతంగా ఉన్నా, వీరి మెదడు మాత్రం ఆలోచనలతో పరిగెడుతుంటుంది. వీరు ఇతరుల మాటలు, హావభావాలు, సమయం, ప్రతిచర్యలను చాలా వేగంగా గమనించగలరు. కొన్నిసార్లు అర్ధరాత్రి 2 గంటలకు కూడా వీరి మెదడులో ఏవో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వీరికి ఒకే పనైనా, ఒకే చోటైనా బోర్ కొడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, నలుగురితో మాట్లాడటం వీరికి చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒకేసారి ఎన్నో ఆలోచనలు వీరి మనసులో మెదులుతుంటాయి.
ముఖ్యమైన వ్యక్తిత్వ లక్షణాలు చూస్తే వీరు చాలా తెలివైనవారు, సమయస్ఫూర్తి గలవారు. ఎలాంటి పరిస్థితులకైనా త్వరగా అలవాటు పడతారు. చుట్టూ ఏం జరుగుతుందో వీరు ఎక్కువ ప్రశ్నలు అడగకుండానే ఈజీగా కనిపెట్టేస్తారు. ఎంతటి కష్టమైన సమస్యనైనా నవ్వుతూ, హాస్యంతో ఎదుర్కోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.
వీరికున్న పెద్ద సమస్య ఏంటంటే ఒక చిన్న విషయం గురించి కూడా వంద రకాలుగా ఊహించుకుని బుర్ర పాడుచేసుకుంటారు. ఏదైనా ఒక సంభాషణ జరగడానికి ముందే మనసులో రిహార్సల్ చేస్తారు, జరిగిన తర్వాత కూడా దాని గురించే మళ్లీ మళ్లీ ఆలోచిస్తారు.
ఉద్యోగం & కెరీర్
బుధవారం పుట్టిన వారికి ఒకే రకమైన రొటీన్ పనులు చేయడం నచ్చదు. కమ్యూనికేషన్, కొత్త ఆలోచనలు అవసరమైన రంగాలలో వీరు బాగా రాణిస్తారు. రైటింగ్ (రచన), మార్కెటింగ్, వ్యాపారం, మీడియా, కన్సల్టింగ్, సేల్స్, బ్యాంకింగ్ & ఫైనాన్స్, టీచింగ్, పబ్లిక్ రిలేషన్స్, టెక్నాలజీ రంగాలు వీరికి చక్కగా సరిపోతాయి. స్పెషాలిటీ ఏంటంటే వీరు మార్కెట్ ట్రెండ్స్‌ను త్వరగా పట్టుకుంటారు. ఎంతటి కష్టమైన విషయానైనా ఇతరులకు అర్థమయ్యేలా సులభంగా వివరించగలరు.
ప్రేమ & బంధాలు
వీరు ప్రేమలో పడటానికి కేవలం అందం మాత్రమే సరిపోదు, భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం చాలా ముఖ్యం. మాటలు, జోకులు వీరిని త్వరగా ఆకర్షిస్తాయి. వీరు ఇష్టపడే వారికి తరచూ మెసేజ్‌లు చేయడం, చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుని సర్ప్రైజ్ చేయడం వీరి అలవాటు. వీరు ప్రేమను మనసుతో కంటే మెదడుతో ఎక్కువగా విశ్లేషిస్తారు. భాగస్వామి స్పష్టంగా కాకుండా గందరగోళంగా ప్రవర్తిస్తే వీరు తట్టుకోలేరు. గొడవల కంటే ఎదుటివారి "మౌనం" వీరిని ఎక్కువగా బాధపెడుతుంది.
►ALSO READ | ఆకాశంలో జరిగే ఈ వింతను చూసి తీరాల్సిందే.. బ్లూ మూన్ ఎన్నిసార్లు వచ్చినా ఇది చాలా స్పెషల్..!
ఆర్థిక పరిస్థితి & డబ్బు
వీరికి డబ్బు సంపాదించే అవకాశాలు, వ్యాపార ఆలోచనలు చాలా వేగంగా వస్తాయి. నలుగురితో పరిచయాలు పెంచుకోవడం ద్వారా వీరు బాగా లాభపడతారు. వీరి మేధస్సుకు కొదవ లేదు కానీ, స్థిరత్వం తక్కువ. ఈరోజు ఒక బిజినెస్ ప్లాన్ అనుకుంటే, వచ్చే వారానికి మరో కొత్త ప్లాన్ వైపు మొగ్గు చూపుతారు. ఏదైనా ఒక లక్ష్యంపై స్థిరంగా దృష్టి పెడితేనే వీరు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
బుధవారం పుట్టిన వారు ఎదుర్కొనే సవాళ్లు
బుధ గ్రహం వేగాన్ని ఇస్తుంది, కానీ ఆ వేగం వల్ల ఒక్కోసారి జీవితంలో గందరగోళం ఏర్పడుతుంది. ఒకేసారి చాలా పనులపై దృష్టి పెట్టడం వల్ల ఏదీ సరిగ్గా పూర్తి చేయలేరు. త్వరగా బోర్ కొట్టడం వల్ల విసుగు చెందుతారు. వారి మనసులోని భావాలను మాటల్లో బాగా చెప్పగలరు కానీ, నిజ జీవితంలో ఆ భావోద్వేగాలను ఇతరులతో చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు.
ఆరోగ్య సమస్యలు
వీరు ఒత్తిడికి గురైతే అది మొదట నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపిస్తుంది. అతిగా ఆలోచించడం వల్ల నిద్రలేకపోవడం, జీర్ణక్రియ సమస్యలు, తీవ్రమైన అలసట ఎదురవుతాయి. అందుకే వీరికి కాస్త ప్రశాంత వాతావరణం అవసరం. రోజూ కాసేపు నడవడం , డైరీ రాయడం, మొబైల్/ల్యాప్‌టాప్ స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, సమయానికి నిద్రపోవడం వల్ల వీరి ఆరోగ్యం చాలా బాగుంటుంది.
అదృష్ట రంగులు, సంఖ్య,
వీరి అదృష్ట రంగులు ఆకుపచ్చ, పుదీనా రంగు, లేత బూడిద రంగు, మట్టి రంగులు. అదృష్ట సంఖ్య చూస్తే 5, అనుకూలమైన పనులు చేయాలనుకుంటే ప్రతి బుధవారాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, బిజినెస్ డీల్స్ మాట్లాడటానికి, రాయడానికి ఇంకా ప్లానింగ్ చేయడానికి చాలా మంచి రోజు.
రాబోయే 12 నెలల భవిష్యత్తు
బుధవారం పుట్టిన వారికి రాబోయే 12 నెలలు చాలా కీలకమైనవి. మీ ఆలోచనలను నిజం చేసుకోవడానికి ఇది సరైన సమయం. మీనరాశిలో శని ప్రభావం వల్ల, మీ పరధ్యానం తగ్గి పనులపై శ్రద్ధ పెరుగుతుంది. బద్ధకం వీడి క్రమశిక్షణతో పని చేయడం ప్రారంభిస్తారు. కర్కాటకరాశిలో గురుడి సంచారం వల్ల కుటుంబంలో ఆనందం, ఆర్థిక పొదుపు, మానసిక ప్రశాంతత లభిస్తాయి.ఆ తర్వాత గురుడు సింహరాశిలోకి మారినప్పుడు సమాజంలో మీ గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది.
మకరరాశిలో రాహువు, కర్కాటకంలో కేతువు ప్రభావం వల్ల, మీ అనవసరపు ఆందోళనలు తొలగిపోయి కెరీర్‌లో ఒక గొప్ప వృద్ధి కనిపిస్తుంది. చివరగా ఈ సంవత్సరం, ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించడం పక్కన పెట్టి, ఏదైనా ఒక రంగం లేదా పనిపై దృష్టి పెట్టి కష్టపడితే బుధవారం పుట్టిన వారికి అద్భుతమైన విజయాలు, లాభాలు అందుతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
