'కాక్‌టైల్ 2' రివ్యూ: క్రేజీ లవ్ ట్రయాంగిల్.. రష్మిక యాసపై ట్రోల్స్.. సినిమా ఎలా ఉందంటే?

 'కాక్‌టైల్ 2' రివ్యూ: క్రేజీ లవ్ ట్రయాంగిల్.. రష్మిక యాసపై ట్రోల్స్.. సినిమా ఎలా ఉందంటే?

బాలీవుడ్‌లో ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన రొమాంటిక్ డ్రామా 'కాక్‌టైల్' గుర్తుందా? సైఫ్, దీపికా, డయానా పండించిన ఎమోషన్స్ థియేటర్లలో మ్యాజిక్ చేశాయి. ఇప్పుడు సరిగ్గా అదే టైటిల్‌తో, లవ్ అండ్ ఎమోషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'కాక్‌టైల్ 2'. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ చిత్రాన్ని హోమీ అదజానియా డైరెక్ట్ చేయగా, దినేష్ విజన్ నిర్మించారు. మరి ఈ క్రేజీ గ్లామరస్ కాక్ టైల్ థియేటర్లలో ఎలాంటి రచ్చ చేసింది? ఆడియన్స్‌కు కిక్ ఇచ్చిందా లేదా అనేది చూద్దాం!

కథేంటంటే..

కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ఇద్దరూ పెళ్లి బంధంపై నమ్మకం లేక, దశాబ్ద కాలంగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో బిందాస్‌గా బతికేస్తుంటారు. కానీ, సొసైటీ, ఫ్యామిలీ ప్రెజర్ తట్టుకోలేక కాస్త రిలాక్స్ అవ్వడానికి సిసిలీ వెళ్తారు. అక్కడ దియా కాలేజ్ ఫ్రెండ్ అలీ (కృతి సనన్) ఎంట్రీ ఇస్తుంది. అలీ ఫుల్ కేర్‌ఫ్రీ లైఫ్‌స్టైల్ ఉన్న అమ్మాయి. అయితే, కునాల్ కట్టుబాటుపై దియాకు హఠాత్తుగా అనుమానం వచ్చి, అతడిని లైన్ వేసి టెస్ట్ చేయమని అలీకి ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తుంది. కానీ, ఫన్ కోసం మొదలైన ఈ టెస్ట్ కాస్తా.. అలీ నిజంగానే కునాల్‌తో ప్రేమలో పడటంతో సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఇండియా తిరిగొచ్చాక పెళ్లి ముహూర్తాలు పెట్టే టైమ్‌కి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ గందరగోళం నుంచి కునాల్ ఎలా బయటపడ్డాడు? అన్నదే అసలు సిసలైన కథ.

ఎలా ఉందంటే?

సినిమా విజువల్స్ పరంగా చాలా గ్రాండ్‌గా, గ్లామరస్‌గా ఉంది. సిసిలీ అందాలు, సూపర్ హిట్ సాంగ్స్ యువతను ఇట్టే ఆకట్టుకుంటాయి. లవ్ రంజన్ అందించిన ఈ కథలో యూత్ ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే మాత్రం కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. దాదాపు 150 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో ఫస్టాఫ్ అంతా లవ్, రోమాన్స్, ఫన్‌తో సాగిపోయినా.. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. ఎమోషన్స్ మరింత స్ట్రాంగ్‌గా ఉండి ఉంటే సినిమా రేంజ్ ఇంకోలా ఉండేది. ఒరిజినల్ 'కాక్‌టైల్‌'లో ఉన్న ఇంతియాజ్ అలీ మార్క్ డెప్త్ ఇందులో కొంచెం మిస్ అయింది.  ఈ మోడరన్ లవ్ డ్రామా.. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది

ALSO READ : కథ, స్క్రీన్‌ప్లేతో రీఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్..

ఎవరెలా చేశారంటే?

సినిమాను ఒంటిచేత్తో నిలబెట్టింది మాత్రం కృతి సనన్ అనే చెప్పాలి. అలీ పాత్రలో కృతి ఎనర్జీ, గ్లామర్ అండ్ యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్. ఇక షాహిద్ కపూర్ తన ఎక్స్‌పీరియన్స్‌తో కునాల్ క్యారెక్టర్‌ను చాలా సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా ప్లే చేసి ఆకట్టుకున్నాడు. మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎమోషనల్ సీన్స్‌లో జీవించేసింది. అయితే, రష్మిక హిందీ డైలాగ్స్ చెప్పేటప్పుడు సౌత్ ఇండియన్ యాస (Accent) కొంచెం స్పష్టంగా తెలియడం బాలీవుడ్ ఆడియన్స్‌కు అంతగా నచ్చలేదు. 

మిక్స్‌డ్ రెస్పాన్స్..

సోషల్ మీడియాలో దీనిపై మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు సినిమా చాలా బాగుందని ట్వీట్లు పెడుతుంటే, మరికొందరు మాత్రం స్క్రీన్‌ప్లే బోర్ కొట్టించిందని పెదవి విరుస్తున్నారు.  పాత సినిమాతో పోల్చకండి, ఇదొక ఫ్రెష్ కాన్సెప్ట్. షాహిద్, కృతి యాక్టింగ్ అదిరిపోయింది అని కొందరు పాజిటివ్‌గా చెప్తుంటే... మరికొందరు సినిమా అంతా మెరుపులే కానీ మ్యాటర్ లేదు. లవ్ రంజన్ కథ రొటీన్‌గా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మొత్తంగా చెప్పాలంటే.. 'కాక్‌టైల్ 2' విజువల్ గా చాలా బాగుంది, నటీనటుల పర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. కానీ లవ్ స్టోరీకి కావలసిన కథ మాత్రం ఇందులో కొరవడింది. మరి ఈ వీకెండ్‌లో కేవలం గ్లామర్, లొకేషన్స్, లైట్ హార్టెడ్ డ్రామా కావాలనుకుంటే దీనిపై ఒక లుక్ వేయొచ్చు.