షుగర్ (డయాబెటిస్) ఉన్నవారు వాడే మెట్‌ఫార్మిన్ అనే మందు గురించి శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారు. ఈ మందును మనం 60 ఏళ్లుగా వాడుతున్నా, అది శరీరంలో ఎలా పనిచేస్తుందో ఇన్నాళ్లూ మనకు పూర్తిగా తెలియదు. లేటెస్ట్ గా 2025లో చేసిన పరిశోధనల ప్రకారం, ఈ మందు కేవలం కడుపుపై లేదా కాలేయంపైనే కాకుండా, నేరుగా మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని తేలింది.
సాధారణంగా ఈ మందు కాలేయంలో చక్కెరను తగ్గిస్తుందని అనుకునేవారు. కానీ, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల ప్రకారం మెట్‌ఫార్మిన్ మెదడులోని ఒక భాగానికి (హైపోథాలమస్) చేరుకుంటుంది. అక్కడ Rap1 అనే ప్రోటీన్ పనితీరును మారుస్తుంది. మెదడులోని కొన్ని నరాల కణాలను (SF1 న్యూరాన్లు) యాక్టివేట్ చేయడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. అంటే, మన శరీరం గ్లూకోజ్‌ను ఎలా వాడుకోవాలో మెదడుకు ఈ మందు చెబుతుంది అన్నమాట.
ఈ మందు కేవలం షుగర్ తగ్గించడానికే కాదు, మరికొన్ని ఆశ్చర్యకరమైన పనులకు కూడా పనికొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ముసలితనం రాకుండా: దీనిని వృద్ధాప్యాన్ని ఆపే మందు అంటే Gerotherapeutic అని కూడా పిలుస్తున్నారు. ఇది కణాలు పాడవకుండా కాపాడుతూ, ఎక్కువ కాలం బ్రతకడానికి సహకరిస్తుందని నమ్ముతున్నారు. వైరస్ వల్ల వచ్చే మెదడు సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఈ మందు సాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. 2025లో జరిగిన ఒక సర్వేలో మెట్‌ఫార్మిన్ వాడే మహిళల్లో అకాల మరణాల ముప్పు మిగతా వారి కంటే తక్కువగా ఉందని తేలింది.
ALSO READ : నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట విషాదం..
ఈ మందు వల్ల ఎన్ని లాభాలు ఉన్నా, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కడుపులో వికారం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ మందు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దశాబ్దాలుగా వాడుతున్న ఈ చిన్న టాబ్లెట్ మన శరీరంలోని మొత్తం శరీర వ్యవస్థపై ముఖ్యంగా మెదడుపై ప్రభావం చూపుతుందని తెలియడం వైద్య రంగంలో ఒక పెద్ద మార్పు. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని మెరుగైన మందులు వచ్చే అవకాశం ఉంది.
