రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే కుండీలో ఫ్రెష్ పుదీనా పెంచడం ఇంత ఈజీనా ?

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే కుండీలో ఫ్రెష్ పుదీనా పెంచడం ఇంత ఈజీనా ?

మార్కెట్‌కి వెళ్లినప్పుడు కొత్తిమీర, పుదీనా కొనడం మనందరికీ అలవాటే. అయితే మార్కెట్లో దొరికే పుదీనాపై రసాయనాలు, మందులు ఎక్కువగా చల్లుతుంటారు. అదే మన ఇంట్లో, చిన్న కుండీలో ఎలాంటి మందులు లేకుండా ఆర్గానిక్‌గా పుదీనాను పెంచుకుంటే.. ఆ సువాసన, రుచే వేరు..!

పుదీనాను పెంచడానికి పెద్ద స్థలం లేదా తోట అవసరం లేదు. మీ ఇంటి బాల్కనీలో లేదా కిటికీ దగ్గర చిన్న కుండీ ఉంటే చాలు. దీని కోసం నర్సరీకి వెళ్లి మొక్కలు కొనాల్సిన అవసరం కూడా లేదు. మనం వంట ఇంటి కోసం తెచ్చుకునే పుదీనా కాడలతోనే ఎంతో సులభంగా దీనిని పెంచవచ్చు. ఇంట్లో కుండీలలో పుదీనాను ఎలా పెంచాలో ఇప్పుడు చూద్దామా....

1. పుదీనా కాడలను తీసుకోవడం 
మార్కెట్ నుండి పుదీనా కట్ట తెచ్చినప్పుడు, కాస్త లావుగా, బలంగా ఉన్న కాడలను వేరు చేసుకోండి. ఆకులను వంటల్లో  వాడుకుని, కాడలను మాత్రం పక్కన పెట్టండి.  పుదీనా కాడలను సాయంత్రం పూట నాటడం చాలా మంచిది. ఒకవేళ మీరు వెంటనే నాటలేకపోతే, ఆ కాడలను ఎండిపోకుండా ఒక గ్లాసు నీళ్లలో ఉంచండి.

2. మట్టి ఇంకా  కుండీ ఎలా ఉండాలి?
 పుదీనా పక్కలకు త్వరగా పాకుతుంది. కాబట్టి లోతు తక్కువగా ఉన్నా ఫర్వాలేదు కానీ, వెడల్పుగా ఉండే కుండీ లేదా గ్రో బ్యాగ్‌ను తీసుకోండి. కుండీ కింద నీరు బయటకు పోవడానికి రంధ్రాలు తప్పనిసరిగా ఉండాలి. సారవంతమైన తోట మట్టిని తీసుకోండి. నీరు నిల్వ ఉండకుండా, లూజ్‌గా ఉండేలా చూసుకోండి.

3. పుదీనాని నాటడం ఎలా?
మొదట కుండీలోని మట్టిని కొద్దిగా తడపండి. పుదీనా కాడలను ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఇస్తూ మట్టిలో నాటండి. నాటిన తర్వాత పైన కొద్దిగా నీళ్లు చల్లండి.

పుదీనా మొక్కకు ఉదయం పూట ఎండ తగిలి, మధ్యాహ్నం కాస్త నీడ ఉండే ప్రదేశం  చాలా పర్ఫెక్ట్. మట్టి ఎప్పుడూ కాస్త తేమగా ఉండాలి. అలా అని ఎక్కువ నీళ్లు పోసి మట్టిని బురదగా మార్చకూడదు, ఎక్కువ నీరైతే వేళ్లు కుళ్ళిపోతాయి. మొక్క బలంగా పెరగడానికి ప్రతి 10 నుండి 15 రోజులకు ఒకసారి కొద్దిగా వర్మీకంపోస్ట్ వేయండి.]

►ALSO READ | హోటల్ స్టైల్ 'క్రిస్పీ కార్న్'.. ఇంట్లోనే ఈజీగా, కరకరలాడేలా ఇలా చేసుకోండి!

కొన్ని రోజుల్లోనే కాడల నుండి కొత్త ఆకులు రావడం మీరు గమనిస్తారు. ఆకులు బాగా పెరిగిన తర్వాత, మీకు కావలసినప్పుడు వాటిని కోసి వంటల్లో వాడుకోవచ్చు. మీరు ఎంత బాగా కోస్తుంటే, మొక్క అంత దట్టంగా పెరుగుతుంది.

ఇంట్లో పండిన పుదీనాతో లాభాలు:
*ఫ్రెష్ పుదీనా ఆకులను మజ్జిగ, నిమ్మరసం, ఐస్డ్ టీలలో వేసుకుంటే అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది.
*జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు పుదీనా టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. అలాగే జలుబు, తలనొప్పి, ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు తాజా పుదీనా ఆకులను నీళ్లలో వేసి ఆవిరి పడితే వెంటనే రిలీఫ్ దొరుకుతుంది.