రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్‌లో అందరూ ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసే ఐటమ్ 'క్రిస్పీ కార్న్' (Crispy Corn). పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా, కాస్త కారంగా, కాస్త పుల్లగా ఉండే ఈ స్నాక్‌ను ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకైనా, పెద్దలకైనా సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. థియేటర్లు, హోటళ్లలో పిండి మందంగా ఉండటానికి కొన్నిసార్లు గుడ్డు వాడుతుంటారు. కానీ ఇక్కడ మనం గుడ్డు లేకుండా అంతే క్రిస్పీగా, టేస్టీగా చేసుకునే సులువైన పద్ధతిని చూద్దామా....
కావలసిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు (స్వీట్ కార్న్): 3 కప్పులు
కార్న్ ఫ్లోర్ : 6 టేబుల్ స్పూన్లు
బియ్యం పిండి లేదా మైదా: 4 నుండి 6 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి: ½ టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: 4 కప్పులు
మసాలా కోసం:
జీలకర్ర పొడి: ¾ టీస్పూన్
చాట్ మసాలా: ¾ నుండి 1 టీస్పూన్
కారం: ½ నుండి ¾ టీస్పూన్
పైన చల్లుకోవడానికి:
ఉల్లిపాయ ముక్కలు: 2 నుండి 3 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి)
కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్ (కావలసింత)
తయారీ విధానం
మొక్కజొన్న కంకులను ముక్కలుగా విరిచి, గింజలను చేత్తో ఒలుచుకోవాలి. మరీ లేతగా, నీరుగా ఉండే గింజలు కాకుండా కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోండి.
ఇప్పుడు ఒక గిన్నెలో 4 కప్పుల నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరిగాక ఒలిచిన గింజలు వేసి కేవలం 2-3 నిమిషాలు ఉడికించి, జల్లెడలో వడకట్టాలి. వెంటనే చల్లటి నీళ్ల కింద కడిగితే అవి మరీ మెత్తగా అవ్వకుండా ఉంటాయి.
►ALSO READ | రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే !
తడి అస్సలు లేకుండా వడకట్టిన గింజలను ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి కలపండి. ఇప్పుడు 3 చెంచాల కార్న్ ఫ్లోర్, 3 చెంచాల బియ్యం పిండి వేసి బాగా కలపాలి. పిండి గింజలకు అంటుకోవడానికి అవసరమైతేనే 1-2 చుక్కల నీళ్లు చల్లండి. మళ్లీ మిగిలిన పిండిని కూడా వేసి గింజల చుట్టూ పిండి కోటింగ్ బాగా కలపాలి.
ఇప్పుడు కడాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. మంటను మీడియంలో ఉంచి, ఒక పెద్ద గరిటెతో కోటింగ్ చేసిన గింజలను నూనెలో వేయాలి. గింజలు వేగి పైకి తేలుతూ, చిటపట శబ్దం తగ్గాక వాటిని తీసి జల్లెడ గిన్నెలో వేయండి.
ఫ్రై చేసిన కార్న్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని వేడిగా ఉన్నప్పుడే కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. చివరగా తినేముందు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కొన్ని చుక్కల నిమ్మరసం పిండుకుని సర్వ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన, కరకరలాడే హోటల్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ! వేడివేడిగా తింటే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
