నిమ్మకాయ తొక్కలు పడేస్తున్నారా..? ఇలా చేస్తే సూపర్ క్లీనింగ్ లిక్విడ్ రెడీ!

నిమ్మకాయ తొక్కలు పడేస్తున్నారా..? ఇలా చేస్తే సూపర్ క్లీనింగ్ లిక్విడ్ రెడీ!

మనం సాధారణంగా నిమ్మకాయ పిండుకున్నాక తొక్కలను చెత్తబుట్టలో పడేస్తుంటాం. కానీ ఆ తొక్కల్లో మంచి సువాసననిచ్చే నూనెలుంటాయి. వాటిని వృథా చేయకుండా ఒక సింపుల్ హోమ్‌మేడ్ క్లీనర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా.... 

నిమ్మకాయ - వెనిగర్ లిక్విడ్ తయారీ విధానం
తయారీ: ఒక గాజు సీసా నిండా మిగిలిపోయిన నిమ్మకాయ తొక్కలు వేయండి. అందులో తెల్ల వెనిగర్ పోసి, తొక్కలన్నీ మునిగేలా చూడండి. ఆ సీసాను మూతపెట్టి, వెలుతురు తగలని చల్లని ప్రదేశంలో 2 నుంచి 3 వారాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తొక్కలను వడకట్టి, ఆ ద్రవానికి సమానంగా నీళ్లు కలపాలి. అంతే, చక్కటి సిట్రస్ వాసన వచ్చే నేచురల్ క్లీనర్ తయారవుతుంది!

ఇంట్లో దీన్ని ఎక్కడ, ఎలా వాడొచ్చంటే :
1. వంటగది క్లీన్ చేయడానికి
కౌంటర్‌టాప్‌లు, స్టవ్‌టాప్‌లు, క్యాబినెట్ డోర్లపై పట్టిన జిడ్డు, మరకలు పోవడానికి ఈ నేచురల్ క్లీనర్ చాలా బాగా పనిచేస్తుంది. వెనిగర్ జిడ్డును కరిగిస్తే, నిమ్మతొక్క సువాసన ఇల్లు తాజాగా ఉండేలా చేస్తుంది.

2. సింక్ పై నీటి మరకలు పోగొట్టడానికి
సింక్‌లు, వాష్‌బేసిన్‌లు, బాత్ రూమ్ కుళాయిలపై నీటి వల్ల తెల్లటి మరకలు ఏర్పడుతుంటాయి. ఈ లిక్విడ్‌ను ఆ ప్రాంతాలపై స్ప్రే చేసి, కొద్దిసేపు ఆగి తుడిస్తే మరకలు పోయి కొత్తవాటిలా మెరుస్తాయి.

3. చెత్త డబ్బాలు, డ్రైనేజీ వాసన పోగొట్టడానికి
వర్షాకాలంలో సింక్ డ్రైనేజీలు, చెత్తబుట్టల నుంచి వచ్చే చెడు వాసన ఇబ్బంది పెడుతుంటుంది. ఈ లిక్విడ్‌ అక్కడ స్ప్రే చేస్తే.. నిమ్మ వాసన బ్యాక్టీరియా వల్ల వచ్చే దుర్వాసనను ఇట్టే తరిమేస్తుంది.

4. అద్దాలు, గాజు సామాగ్రి పై జిడ్డు వదలడానికి
హాల్స్ లేదా కిచెన్లలో ఉండే గాజు టేబుళ్లు, అద్దాలపై వేలిముద్రలు, జిడ్డు మరకలు పడుతుంటాయి. ఈ లిక్విడ్‌ తో తుడిస్తే అద్దాలు చక్కగా మెరుస్తాయి. 

5. ప్లాస్టిక్ డబ్బాల్లో వాసన పోవడానికి
వంటగదిలో వాడే ప్లాస్టిక్ డబ్బాలు, బాక్సులు చాలా రోజులు వాడితే ఒకరకమైన వాసన వస్తాయి. ఈ సిట్రస్ వెనిగర్ వాటర్ తో తుడిస్తే ఆ బ్యాడ్ స్మెల్ పోయి మంచి సువాసన వస్తుంది.

కొన్ని జాగ్రత్తలు:
బ్లీచ్‌తో కలపవద్దు: వెనిగర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లీచ్, అమ్మోనియా లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కలపకూడదు. ఇది ప్రమాదకరమైన రసాయన చర్యకు దారితీస్తుంది.

*పాలరాయి, గ్రానైట్ వంటి రాళ్లు, అలాగే చెక్క వస్తువులపై ఈ వెనిగర్ ద్రావణాన్ని అస్సలు ఉపయోగించవద్దు. అవి పాడైపోయే అవకాశం ఉంది.

*ఈ లిక్విడ్ తయారీకి చెడిపోయిన లేదా కుళ్ళిపోయిన నిమ్మకాయ తొక్కలను వాడకూడదు. మంచి ఫ్రెష్ తొక్కలనే ఉపయోగించాలి.

►ALSO READ | మెడలో చైన్.. చేతికి బ్రేస్‌లెట్.. మనసుకు రిలీఫ్!