40 ఏళ్లు దాటాయా? నిలబడలేకపోతున్నారా ? తల తిరుగుతోందా ? సమస్య మీ చెవులోనే ఉండొచ్చు!

 40 ఏళ్లు దాటాయా? నిలబడలేకపోతున్నారా ? తల తిరుగుతోందా ? సమస్య మీ చెవులోనే ఉండొచ్చు!

సాధారణంగా చెవులు అంటే కేవలం వినడానికే మాత్రమే అనుకుంటాం. కానీ, మన శరీరం కింద పడిపోకుండా స్థిరంగా నిలబడాలన్నా, నడవాలన్నా చెవిలోని లోపలి భాగం అత్యంత కీలకం. ఇది మన శరీరానికి ఒక నావిగేషన్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. మన లోపలి చెవిలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి కోక్లియా, ఇది మనం వినడానికి సహాయపడుతుంది. రెండోది వెస్టిబ్యులర్ సిస్టం, ఇది మన శరీరం బ్యాలెన్స్ గా ఉండేలా చూస్తుంది. ఈ రెండు భాగాలు ఒకే నరం ద్వారా మెదడుకు సమాచారాన్ని పంపిస్తాయి. అందుకే చెవిలో సమస్య వస్తే వినికిడితో పాటు తలతిరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

40 ఏళ్లు దాటాక :
వయసు పెరిగే కొద్దీ లోపలి చెవిలో ఉండే సెన్సార్లు  క్రమంగా బలహీనపడతాయి. దీనివల్ల మెదడుకు అందే సంకేతాలు ఆలస్యమవుతాయి. దింతో ఒక్కసారిగా తల తిరగడం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం, మీరు ఉన్న ప్రదేశం  తిరుగుతున్నట్లు అనిపించడం, వికారం, చూపు మసకబారడం వంటి సమస్యలు వస్తాయి.

 సమస్యలు:
*BPPV: తల అటు ఇటు తిప్పినప్పుడు ఒక్కసారిగా కళ్లు తిరగడం.
*మెనియర్స్ వ్యాధి: వినికిడి తగ్గడం, చెవిలో గంటలు మోగినట్లు అనిపించడం.
*వెస్టిబ్యులర్ మైగ్రేన్: తీవ్రమైన తలనొప్పితో పాటు తలతిరగడం.

చాలామంది తలతిరుగుడును సాధారణంగా నీరసం అని భావిస్తారు. కానీ, ప్రతిసారి ఇలా జరగడం వల్ల కింద పడిపోయి దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. పడిపోతామనే భయం మనిషిని మానసికంగా కుంగదీస్తుంది. అందుకే 40 ఏళ్లు పైబడిన వారు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే హాయిగా, స్వతంత్రంగా జీవించవచ్చు.

►ALSO READ | Sunday Snacks: గుమ్మడి బ్రెడ్..చిక్కుడు మురుకులు.. సూపర్ టేస్ట్.. ఇంట్లోనే తయారీ