ఆదివారం వచ్చిందంటే.. పిల్లలకు పండగే. ఇంట్లో కొత్తకొత్త రుచులు.. గ్రౌండ్ లో రకరకాల ఆటలు. ఈ రెండూ ఉన్నప్పుడే కదా.. పిల్లలకు హాలీడే జాలీగా గడుస్తుంది. ఆ ఆనందానికి వెరైటీ శ్నాక్స్ తోడైతే.. ఇంకా మజా చేస్తారు పిల్లలు. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..!
గుమ్మడి బ్రెడ్ తయారీకి కావాల్సినవి:
- మైదాపిండి-రెండున్నర కప్పులు
- బేకింగ్ పౌడర్ - ఒక టీ స్పూన్
- దాల్చినచెక్క పొడి- అరటీస్పూన్
- అల్లం పేస్ట్-పావు టీ స్పూన్
- జాజికాయ పొడి - అర టీ స్పూన్
- గుమ్మడి కాయ గుజ్జు - ఒక కప్పు
- అరటిపండు గుజ్జు- ఒక కప్పు
- చక్కెర - అర కప్పు
- తేనె- అర కప్పు
- నూనె - సరిపడా
- గుడ్లు-రెండు
- వాల్ నట్స్- ముప్పావు కప్పు
- ఉప్పు- తగినంత
గుమ్మడి బ్రెడ్ తయారీ విధానం
ఒక గిన్నెలో మైదాపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, దాల్చినచెక్క పొడి, జాజికాయ పొడి... ఒకదాని తర్వాత ఒకటి వేసి కలపాలి. తర్వాత అల్లం పేస్ట్, అరటిపండు గుజ్జు, గుమ్మడి కాయ గుజ్జు, చక్కెర, నూనె, గుడ్లసొన, తేనె వేసి బాగా కలపాలి.
చివరగా వాల్నట్స్ వేసి, మిశ్రమాన్ని బ్రెడ్ మేకర్ బౌల్లో వేయాలి. పెద్ద గిన్నెలో ఉప్పు వేసి స్టవ్ పై పెట్టి వేడి చేయాలి. అందులో బ్రెడ్ బౌల్ పెట్టి మూత పెట్టాలి. సన్నని మంటపై గంటసేపు ఉడికించాలి.
చల్లారిన తర్వాత నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేయాలి. రుచికరమైన గుమ్మడికాయ బ్రెడ్ రెడీ.
పాలక్ వడ తయారీకి కావాల్సినవి
- ఉల్లిగడ్డ తరుగు- పావు కప్పు
- బియ్యప్పిండి - రెండు టీ స్పూన్లు
- ఉప్పు- తగినంత
- పచ్చిమిర్చి పేస్ట్ - ఒక టీ స్పూన్
- అల్లం పేస్ట్- అర టీ స్పూన్
- పసుపు - చిటికెడు
- కొత్తిమీర తరుగు - పావు కప్పు
- పుదీనా ఆకులు - గుప్పెడు
- బ్రెడ్ ముక్కలు-నాలుగు
- పాలకూర తరుగు - ఒక కప్పు
పాలక్ వడ తయారీ విధానం
బ్రెడ్ ముక్కలను మిక్సీలో వేసి పొడి చేయాలి. ఒక గిన్నెలో పాలకూర తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, బియ్యప్పిండి, ఉప్పు, ఉల్లిగడ్డ తరుగు, పసుపు, పుదీనా ఆకులు, బ్రెడ్ పొడి, సరిపడా నీళ్లు పోసి కలపాలి.
►ALSO READ | విశ్వాసం: ఎలాంటి వారితో స్నేహం చేయాలి.. ఫ్రెండ్ షిప్ చేసే ముందు ఏడు మాటలు గమనించండి..!
మిశ్రమం మెత్తగయ్యాక వడల్లా వత్తి, నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. వీటిని సాస్ లేదా చట్నీతో తింటే యమ్మీగా ఉంటాయి.
చిక్కుడుగింజల మురుకులు తయారీకి కావాల్సినవి
- చిక్కుడు గింజలు (ఉడికించిన)- ఒక కప్పు
- మినప్పప్పు - ఒకటిన్నర కప్పు
- బియ్యం - మూడు కప్పులు
- వెన్న-రెండు టీ స్పూన్లు
- కారం - ఒక టీ స్పూన్
- వాము - అర టీ స్పూన్
- నువ్వులు - ఒక టీస్పూన్
- ఉప్పు - తగినంత
- నూనె - సరిపడా
చిక్కుడుగింజల మురుకులు తయారీ విధానం
మినప్పప్పు, బియ్యాన్ని కలిపి మెత్తగా పిండి పట్టించాలి. తర్వాత అందులో చిక్కుడు గింజల ముద్ద (మిక్సీ పట్టాలి), వెన్న, కారం, ఉప్పు, వాము. నువ్వులు వేయాలి. గోరువెచ్చని నీళ్లు పోస్తూ ఉండలు కట్టకుండా మెత్తగా కలపాలి.
ఆ పిండిని కొద్దికొద్దిగా మురుకుల గిద్దెలో పెట్టి వత్తాలి. వాటిని మసులుతున్న నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఈ మురుకులు టైమ్ సాస్ కి కాదు, ఆరోగ్యానికి కూడా మంచివి.
