ఏడు అంటే 7 సెకన్లలో మీ గుండె ఎలా పని చేస్తుందో చెప్పేస్తుంది.. AI యాప్ తయారు చేసిన 14 ఏళ్ల బాలుడు

ఏడు అంటే 7 సెకన్లలో మీ గుండె ఎలా పని చేస్తుందో చెప్పేస్తుంది.. AI యాప్ తయారు చేసిన 14 ఏళ్ల బాలుడు

గుండె మన శరీరంలో ముఖ్యమైన ఆర్గాన్..ఇది సరిగ్గా పనిచేస్తేనే మనిషి బ్రతికి ఉంటాడు.ఇటీవల కాలంలో అప్పుడే పుట్టిన పిల్లలను నుంచి వృద్దుల వరకు వయసుతో సంబంధం లేకుండా గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. గుండె జబ్బులను ముందే పసిగట్టగలిగితే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. గుండె జబ్బులను డయాగ్నసిస్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని అయిన ఈ రోజుల్లో భారతీయ సంతతికి చెందిన 14 యేళ్ల బాలుడు గుండె జబ్బులను కేవలం ఏడు సెకన్లలో పసిగట్టే స్మార్ట్ ఫోన్ యాప్ ను తయారు చేశాడు. వివరాల్లోకి వెళితే.. 

ALSO READ | ఐఐఎస్ఈఆర్లో ఉద్యోగాలు.. జాబ్ లొకేషన్ తిరుపతి.. పీజీ చేసి ఉంటే అప్లై చేయొచ్చు

టెక్సాస్‌ లోని ఫ్రిస్కోకు చెందిన 14 ఏళ్ల సిద్ధార్థ్ నంద్యాల బాలుడు కేవలం 7 సెకన్లలో గుండె జబ్బులను గుర్తించగల స్మార్ట్‌ఫోన్ యాప్‌ను ఆవిష్కరించి వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. నంద్యాల సిర్కాడియన్ AI అనే యాప్ గుండె జబ్బుల ప్రారంభ లక్షణాలను అద్భుతమైన ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది. 

ఈ AI-ఆధారిత యాప్, స్మార్ట్‌ఫోన్ ను గుండె దగ్గర ఉంచినప్పుడు దాని మైక్రోఫోన్‌ను ఉపయోగించి గుండె శబ్దాలను రికార్డ్ చేస్తుంది. ఈ రికార్డింగ్‌లను క్లౌడ్-ఆధారిత మెషిన్ లెర్నింగ్ మోడల్ విశ్లేషించి కేవలం 7 సెకన్లలో గుండె జబ్బులను కనిపెడుతుంది. అరిథ్మియా, అసాధారణ హృదయ స్పందనలు, కరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండె కవాటాల సమస్యలు ఇట్టే గుర్తిస్తుంది. 

ప్రారంభ దశలోనే గుండె జబ్బులను గుర్తించడం ద్వారా మరణాలను తగ్గించడం, ఆరోగ్య సంరక్షణకు సులభంగా అందుబాటులో ఉండే సాధనాన్ని అందించడం లక్ష్యంగా ఈ యాప్ తయారు చేశారు సిద్ధార్థ్.

సిద్ధార్థ్ నంద్యాల తెలిపిన వివరాల ప్రకారం..ఈ యాప్ 96శాతంకంటే ఎక్కువ ఖచ్చితత్వంతో గుండె జబ్బులను గుర్తించగలదు. ఈ యాప్ ను యునైటెడ్ స్టేట్స్‌లో సుమారు 15వేల మంది రోగులు, భారత్ లో 3వేల500 మంది రోగులపై పరీక్షించగా సక్సెస్ అయ్యింది. 

సర్కాడియన్ AI యాప్..ఒక ప్రీ-స్క్రీనింగ్ సాధనం మాత్రమే. సంప్రదాయ రోగ నిర్ధారణ పద్ధతులైన EKG లకు ప్రత్యామ్నాయం కాదు. ప్రస్తుతం ఇది శిక్షణ పొందిన సిబ్బంది మాత్రమే క్లినికల్ గా వాడతారు. 

సిద్దార్థ నంద్యాల ఇంకా ఏమేం కనిపెట్టాడంటే.. 

సిద్దార్థ నంద్యాల టాలెంటెడ్ స్టూడెంట్.. కంప్యూటర్ సైన్స్ విద్యార్థి అయిన సిద్ధార్థ.. సర్కాడియన్ AI యాప్ కంటే ముందు ప్రొస్థెటిక్ ఆర్మ్ ను తయారు చేశాడు. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ కిట్ లను అందించే స్టార్టప్ STEM IT ని స్థాపించాడు. సిద్దార్థ రచయిత కూడా.. అతని రచనలు US ప్రతినిధుల సభ నుంచి గుర్తింపు సర్టిఫికేట్, అప్పటి US అధ్యక్షుడు జో బైడెన్ నుంచిఅభినందన లేఖ అందుకున్నాయి. 

భవిష్యత్ లో సిద్ధార్థ్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులైన న్యుమోనియా, పల్మనరీ ఎంబోలిజంలను కూడా గుర్తించేలా యాప్ సామర్థ్యాలను విస్తరిస్తానంటున్నారు సిద్ధార్థ్ నంద్యాల.