పిచ్చి పీక్స్కు.. ఇన్స్టా రీల్ కోసం రన్నింగ్ ట్రైన్లో ఇలా.. వీడియో వైరల్ !

పిచ్చి పీక్స్కు.. ఇన్స్టా రీల్ కోసం రన్నింగ్ ట్రైన్లో ఇలా.. వీడియో వైరల్ !

కొంతమంది తమ టాలెంట్ నలుగురికీ తెలిస్తే అవకాశాలు వస్తాయనే ఆశతో ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారు. ఇంకొంత మంది సరదా కోసం రీల్స్ చేస్తుంటారు. ఈ రెండు రకాల వాళ్లతో ఎవరికీ వచ్చిన నష్టం లేదు. కానీ.. మూడో రకం బ్యాచ్ కూడా ఒకటి ఉంది. ఫేమస్ పిచ్చితో కొట్టుమిట్టాడే రకం. ఏదో ఒకటి చేసి ఫేమస్ అయిపోవాలని.. ఏది పడితే అది చేస్తుంటారు. కొన్ని సార్లు ఈ పిచ్చి పీక్స్కు చేరి పైత్యపు చేష్టలకు కూడా వెనుకాడరు. ఈ యువతి చేసిన పని కూడా అలాంటిదే. రన్నింగ్ ట్రైన్లో డోర్లు పట్టుకుని గాల్లో వేలాడుతూ.. ప్రాణాలకు ముప్పని తెలిసినా కూడా ఇన్ స్టా రీల్ కోసం వీడియో చేసింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

తమిళ్లోని ఒక పాపులర్ సాంగ్కు ఈ యువతి వేగంగా వెళుతున్న రన్నింగ్ ట్రైన్లో ఫుట్ బోర్డ్ మెట్లపై నిలుచుని చేతులు వదిలేసి డ్యాన్స్ చేసింది. ఏదో పెద్ద ఘన కార్యం చేసినట్లు వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువతిపై కామెంట్ల రూపంలో విరుచుకుపడ్డారు. పొరపాటున కాళ్లు బ్యాలెన్స్ తప్పితే పరిస్థితి ఏంటని మండిపడ్డారు. ప్రాణాలను గాలికొదిలేసి ఇలాంటి వీడియోలు చేయడం అవసరమా అని పొట్టుపొట్టు తిట్టారు. 

ALSO READ : బెంగళూరు: ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టింది.. కట్ చేస్తే చివరికి జరిగింది ఇది..!

ఇలా ఈమెను చూసి ఇంకొందరు ఇలా తయారైతే పరిస్థితి ఏంటని నెటిజన్లు సదరు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్ట్ ఈ వీడియో వైరల్ అవడమే కాదు సదరు యువతిపై రైల్వే పోలీసులు లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇండియన్ రైల్వేస్ యాక్ట్ 1989, సెక్షన్ 156, సెక్షన్ 160 కింద పోలీసులు ఆ యువతిపై కేసులు నమోదు చేశారు. రైల్వే చట్టాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని రైల్వే పోలీసులు హెచ్చరించారు. ఈ వీడియోలో ఉన్న యువతి కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు. లైక్స్, ఫాలోవర్ల కోసం ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాలను రిస్క్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.