సినిమా హీరోల కథలు తెరపై ఎంత ఆసక్తికరంగా ఉంటాయో.. వాళ్ల నిజ జీవిత ప్రయాణాలు అంతకంటే ఎక్కువ స్ఫూర్తినిస్తాయి. ఒకప్పుడు ఆడిషన్‌ల కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన ఓ యువకుడు.. నేడు బాలీవుడ్‌లో బెస్ట్ యాక్టర్స్‌లో ఒకడిగా నిలిచాడు. అతనే అభయ్ వర్మ (Abhay Verma). చిన్న చిన్న అవకాశాలతో మొదలైన అతని ప్రయాణం, ది ఫ్యామిలీ మాన్–2తో గుర్తింపు, సఫేద్‌తో నటుడిగా ప్రశంసలు, ముంజ్యాతో స్టార్‌డమ్, ఇప్పుడు ఆపరేషన్ సఫేద్ సాగర్ వంటి పెద్ద ప్రాజెక్ట్ వరకు చేరుకుంది. ఇదంతా చూస్తే అతని విజయమే కనిపిస్తుంది. కానీ ఆ సక్సెస్ వెనుక రిజెక్షన్స్, కన్నీళ్లు, కష్టాలు.. ఎన్నో దాగి ఉన్నాయి.
అభయ్ వర్మ 1998 జులై 27న హర్యానాలోని పానిపట్‌లో పుట్టాడు. మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అతనికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే మక్కువ. టీవీలో సినిమాలు చూస్తూ హీరోలను అనుకరించడం, అద్దం ముందు డైలాగులు చెప్పడం అతనికి అలవాటే. అతనికి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్‌ను కుటుంబం సీరియస్‌గా తీసుకోలేదు.
చదువుపైనే దృష్టి పెట్టాలని కోరుకుంది. కానీ ఆ చదువు అతనికి పెద్దగా నచ్చలేదు. వరుసగా పరీక్షల్లో విఫలమయ్యాడు. తర్వాత వేరే కోర్స్‌లో చేరినా అక్కడ కూడా మనసు నిలవలేదు. చివరకు ఒక విషయం మాత్రం అర్థమైంది. తాను చేయాల్సింది ఉద్యోగం కోసం చదవడం కాదు.. నటుడిగా మారడమే. ఆ నిర్ణయం తీసుకోవడం ఈజీనే. కానీ దాన్ని నిజం చేయడం మాత్రం అంత ఈజీ కాదు.
కల కోసం ముంబై వెళ్లి..
►ALSO READ | విభిన్న ప్రేమకథా చిత్రం.. అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి..
నటనపై ఉన్న ఇంట్రెస్ట్‌తో, ఎన్నో కలలతో ముంబై చేరుకున్నాడు. ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్.. ఆడిషన్లతోనే గడిచిపోయేది రోజువారీ జీవితం. ఎన్నోచోట్ల సరిపోలేదు, ‘తర్వాత చూద్దాం’ అనే సమాధానాలే వచ్చేవి. కొన్ని ప్రకటనల్లో చిన్న అవకాశాలు వచ్చాయి. అవి డబ్బు కంటే ధైర్యాన్ని ఎక్కువగా ఇచ్చాయి. కెమెరా ముందు నిలబడే అనుభవం వచ్చింది. అదే సమయంలో తన నటనను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాడు. ప్రముఖ నటుల ఇంటర్వ్యూలు చూసేవాడు. వాళ్లు పాత్ర కోసం ఎలా సిద్ధమవుతారు? ఎలా ఆలోచిస్తారు? అనే విషయాలను గమనించేవాడు. అదే తనకు యాక్టింగ్ స్కూల్‌గా మారింది.
సఫేద్.. నటుడిగా గుర్తింపు
2023లో వచ్చిన సఫేద్ అభయ్ జీవితంలో మరో ముఖ్యమైన అధ్యాయం. ఇది కమర్షియల్ సినిమా కాదు. మాస్ ఎంటర్‌టైనర్ కూడా కాదు. కానీ నటుడిగా తనలో ఎంత సామర్థ్యం ఉందో చూపించిన సినిమా మాత్రం ఇదే. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో అతను అద్భుతంగా నటించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. స్టార్‌గా మారడానికి ముందు మంచి నటుడిగా గుర్తింపు రావాలని చాలామంది కోరుకుంటారు. అభయ్‌కు ఆ గుర్తింపును తెచ్చింది సఫేద్.
ఇప్పుడు మరో పెద్ద సవాల్..
ముంజ్యా తర్వాత అభయ్ వర్మ ఎంచుకున్న ప్రాజెక్ట్ కూడా చాలా ప్రత్యేకమైనదే. ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో రూపొందుతున్న నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్‌లో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు.1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం చేపట్టిన అత్యంత సాహసోపేతమైన వైమానిక ఆపరేషన్‌కు ఆపరేషన్ సఫేద్ సాగర్ అని పేరు. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో శత్రువుల స్థావరాలపై భారత వైమానిక దళం నిర్వహించిన దాడులు యుద్ధ గమనాన్ని మార్చాయి. భారత సైనిక చరిత్రలో ఈ ఆపరేషన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి చారిత్రక సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లో అభయ్ నటించడం అతని కెరీర్‌లో మరో పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు.
ఇప్పటివరకు ప్రేమ, కామెడీ, ఎమోషన్‌లతో ఆకట్టుకున్న అభయ్.. ఈసారి దేశభక్తి, యుద్ధ నేపథ్యంలోని పాత్రలో ఎలా కనిపిస్తాడో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అభయ్ వర్మ గురించి ఇండస్ట్రీలో చెప్పుకునే ఒక విషయం ఉంది. ఎంత గుర్తింపు వచ్చినా అతనిలో అహంకారం కనిపించదని. షూటింగ్ సెట్స్‌లో అందరితో కలిసిపోవడం, ప్రతి పాత్రను కొత్తగా నేర్చుకునే అవకాశంగా చూడడం అతని స్వభావం. ఫిట్‌నెస్‌పైనా ప్రత్యేక శ్రద్ధ చూపుతాడు. రెగ్యులర్ వర్క్ అవుట్స్, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అతని రోజువారీ అలవాట్లు.
అభయ్ వర్మ కథలో గొప్ప విషయం స్టార్‌డమ్ కాదు.. పట్టుదల. చదువులో ఎదురుదెబ్బలు తగిలాయి. ఆడిషన్లలో తిరస్కరణలు ఎదురయ్యాయి. నెలల తరబడి అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అయినా కలను మాత్రం వదల్లేదు. ఒక్కో అవకాశం వస్తే దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అందుకే ఈ రోజు అతని పేరు బాలీవుడ్‌లో వినిపిస్తోంది.
ఒక్క సినిమాతో మారిపోయిన జీవితం..
2024లో విడుదలైన ‘ముంజ్యా’ బాలీవుడ్‌లో బిగ్ సక్సెస్ అందుకుంది. హారర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసిన ఈ సినిమాలో అభయ్ వర్మ కథానాయకుడిగా కనిపించాడు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు అతని నటన గురించి మాట్లాడుకున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రావడంతో అతని కెరీర్ ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో అభిమానుల సంఖ్య పెరిగింది. దర్శకుల నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్‌లో ఎదుగుతున్న యువ హీరోల జాబితాలో అభయ్ పేరు చేరిపోయింది.
చిన్న పాత్ర.. పెద్ద గుర్తింపు
ప్రతి నటుడి జీవితంలో ఒక అవకాశం ఉంటుంది. అది కెరీర్‌ను మలుపు తిప్పుతుంది. అభయ్ వర్మకు అలాంటి అవకాశం ‘ది ఫ్యామిలీ మాన్–2’ రూపంలో వచ్చింది. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో అతను చేసిన పాత్ర పెద్దది కాకపోయినా, సహజమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘ఈ కొత్త అబ్బాయి ఎవరు?’ అని సినీ వర్గాలు మాట్లాడుకునేలా చేశాడు. దర్శకులు, నిర్మాతలు అతన్ని గమనించడం మొదలుపెట్టారు. ఇదే అతని కెరీర్‌లో అసలు టర్నింగ్ పాయింట్.
