చంద్రబాబు జైలు నుంచి వస్తే పండుగ చేసుకుంటా : బండ్ల గణేష్​

చంద్రబాబు జైలు నుంచి వస్తే పండుగ చేసుకుంటా : బండ్ల గణేష్​

హైదరాబాద్​ : సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్​చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను దసరా పండుగ చేసుకోలేదని, దీపావళికి చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి బయటకు వస్తే అద్భుతంగా పండుగ చేసుకుంటానని చెప్పారు. చంద్రబాబు వ్యక్తి కాదు.. ఒక శక్తి అన్నారు. సైబర్ టవర్స్ కట్టిన చంద్రబాబు విజన్ గొప్పదని చెప్పారు. హైదరాబాద్​ బాలయోగి స్టేడియంలో నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమంలో పాల్గొన్న బండ్ల గణేష్.. ఆదివారం (అక్టోబర్ 29న) ఈ కామెంట్స్ చేశారు. 

40 రోజులు జైలులో ఉన్నంత మాత్రాన అయ్యేదేమీ లేదన్నారు. చంద్రబాబు వెంట తామంతా ఉన్నామన్నారు. చంద్రబాబు జైలులో ఉంటే కడుపు రగులుతోందన్నారు. అందరికీ న్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. బాబు కోసం తాను జైలుకి వెళ్లడానికి.. చివరకు చవడానికైనా సిద్ధమే అని చెప్పారు. తాను చస్తే ఏమీ కాదని, చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి కావాలన్నారు.

ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తులు చంద్రబాబును పొగిడారని, ఆయన్ను అనుసరించారని బండ్ల గణేష్​చెప్పారు. త్వరలో చంద్రబాబును జైలు నుంచి నిజాయితీగా బయటికి తీసుకొస్తామన్నారు. దమ్మున్న లీడర్ చంద్రబాబు అని, లోకేష్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అని అన్నారు. చంద్రబాబు మరో సైబరాబాద్, అమరావతి కడుతారని చెప్పారు. 

బాబు వెంటే మేము :  బోయపాటి శ్రీను 

ఈరోజే పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. ఈరోజు అందరి నోటి నుంచి వచ్చే ఒకే మాట జై బాబు అని అన్నారు. చంద్రబాబు వెంటనే జైలు నుంచి బయటకు రావాలని కోరుతున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఐటీ రంగానికి హైదరాబాద్​లో  ఒక అద్భుతమైన ప్లాట్ ఫామ్​క్రియేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఈరోజు ఐటీ ఎంప్లాయిస్ విశ్వాసంతో భారీ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు వారికి హ్యాట్సాఫ్ అని చెప్పారు. చంద్రబాబు తప్పకుండా బయటకు వస్తారని అన్నారు. ఎప్పటికీ చంద్రబాబుతోనే తాము ఉంటామన్నారు.