వెండితెరపై తనదైన నటనతో మెప్పించడమే కాదు.. తెర వెనుక కూడా కొందరు స్టార్లు తమ మంచి మనసుతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. అలాంటి అరుదైన నటీమణులలో హైదరాబాద్ ముద్దుబిడ్డ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబు (Tabu) ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమెకు సంబంధించిన ఒక పాత క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె దాతృత్వం, కింది స్థాయి సిబ్బందిని ఆదరించే గుణం ఎలాంటిదో చాటిచెప్పే ఓ ఆసక్తికర సంఘటనను డ్యాన్స్ ఆర్టిస్ట్ రుబీనా ఖాన్ లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఆరు రోజుల కష్టం..
గోవింద నిహలానీ దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్, టబు జంటగా నటించిన యాక్షన్ డ్రామా ‘తక్షక్’ (1999) బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘రంగ్ దే’ సాంగ్ ఒక సంచలనం. ఏఆర్ రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్, ఆశా భోస్లే గాత్రం, దివంగత లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కంపోజిషన్ ఈ పాటను ఎప్పటికీ నిలిచిపోయేలా చేశాయి. అయితే, ఈ పాట వెనుక టబు పడిన కష్టం అంతా ఇంతా కాదు.
టబు శరీరం కొంచెం స్టిఫ్‌గా ఉండటం వల్ల సరోజ్ ఖాన్ చెప్పిన ఫ్లెక్సిబుల్ డ్యాన్స్ స్టెప్స్ చేయడం ఆమెకు కాస్త కష్టమైంది. కానీ, ఆమె అస్సలు పట్టువదల్లేదు. రిహార్సల్స్ సమయంలో కనీసం కూర్చోవడానికి కూడా విరామం తీసుకోకుండా రాత్రింబగళ్లు కష్టపడ్డారు. అలా దాదాపు 6 రోజుల పాటు శ్రమించి ఆ పాటను అద్భుతంగా పూర్తి చేశారు అని రుబీనా గుర్తు చేసుకున్నారు.
►ALSO READ | Mirai 2 : సైలెంట్‌గా మొదలైన తేజ సజ్జా ‘మిరాయ్ 2’ షూటింగ్... రంగంలోకి రానా, మంచు మనోజ్!
బంగారు గాజులు, చైన్‌లు గిఫ్ట్‌గా..!
షూటింగ్ పూర్తయ్యాక స్క్రీన్‌పై విజువల్స్ చూసుకున్న టబు.. ఆనందంతో ఎమోషనల్ అయ్యారట. ఆ సంతోషంలో డ్యాన్స్ మాస్టర్ సరోజ్‌ఖాన్‌కు బంగారు గాజులు, ఆమె మేల్ అసిస్టెంట్‌కు బంగారు చైన్, ఫీమేల్ అసిస్టెంట్‌కు బంగారు బ్రేస్‌లెట్ కానుకలుగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిందని గుర్తు చేశారు రుబీనా ఖాన్. అంతేకాదు, తనతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యాన్స్ చేసిన సుమారు 60 మంది డ్యాన్సర్లకు ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున నగదు పారితోషికం ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఒక టాప్ హీరోయిన్ డ్యాన్స్ టీమ్ మొత్తానికి ఇలా బంగారు ఆభరణాలు గిఫ్ట్‌గా ఇవ్వడం ఇండస్ట్రీలోనే అప్పట్లో ఒక సంచలనం అని చెప్పకొచ్చారు రుబీనా.
కింగ్ 100 లో..
ప్రస్తుతం టబు టాలీవుడ్ కింగ్ నాగార్జున సరసన ‘కింగ్ 100’ చిత్రంలో నటిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం 2026 చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నటిగా ఎన్నో శిఖరాలను అధిరోహించినా.. టబులోని ఈ సింప్లిసిటీనే ఆమెను అందరి కంటే ప్రత్యేకం చేస్తుందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
