రక్తం పంచుకున్నవాళ్లే గొడ్డళ్లు పట్టుకుంటే? DSF ప్రొడక్షన్స్ నుంచి రియలిస్టిక్ మూవీ.. యాక్టర్స్ కావాలె!

రక్తం పంచుకున్నవాళ్లే గొడ్డళ్లు పట్టుకుంటే? DSF ప్రొడక్షన్స్ నుంచి రియలిస్టిక్ మూవీ.. యాక్టర్స్ కావాలె!

గత ఏడాది 'రాజు వెడ్స్‌ రాంబాయి' సినిమాతో థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించిన DSF ప్రొడక్షన్స్ బ్యానర్.. ఇప్పుడు రూట్ మార్చింది. ఈసారి గుండెల్ని పిండేసే ఒక సాలిడ్, పక్కా రియలిస్టిక్ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీతో మన ముందుకు రాబోతోంది. విలక్షణ చిత్రాల దర్శకుడు వేణు వుడుగుల, సంధ్యా భాను చల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మధుకర్ రెడ్డి కొమిరెడ్డి కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. మన మట్టి కథలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే వేణు వుడుగుల నిర్మాణంలో వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే ఇండస్ట్రీలో క్రేజీ అంచనాలు మొదలయ్యాయి.

అసలు కథేంటంటే.. 

భారతీయ కుటుంబాల్లో అన్నదమ్ముల గొడవలు కొత్తేమీ కాదు. కానీ, ఒకే రక్తం పంచుకున్న ఇద్దరు అన్నదమ్ములు విడిపోతే కేవలం ఆ ఇల్లు మాత్రమే చీలిపోతుందా? లేక ఆ ఊరి రాతే మారిపోతుందా? అనే ఒక గంభీరమైన పాయింట్‌తో ఒక యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా థీమ్‌ను వివరిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది:

ఒక యాదర్థ గాథ ఆధారంగా.. 

అన్నదమ్ములు అంటే రామలక్ష్మణుల్లా ఉండేవారనే రోజులు పోయాయి.. ఇప్పుడు రక్తం పంచుకున్నవాళ్లే గొడ్డళ్లు పట్టుకునే మహాభారతం నడుస్తోంది. మా ఊరు జమ్మికుంట మట్టిసాక్షిగా.. ఇద్దరు అన్నదమ్ముల పంచాయితీ, కేవలం వాళ్ల ఇల్లనే కాదు... మా ఊరి రాతనే మార్చేసింది. అసలు ఆ రోజు ఎవరు గెలిచారో తెలియదు కానీ.. ఊరు మాత్రం ఓడిపోయింది. ఇది ఏ ఇంట్లోనూ జరగకూడని కథ. పిల్లలు, పెద్దలు, తాతలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు.. అందరూ బయల్దేరండి, ఆ అన్నదమ్ముల పంచాయితీ ఏంటో సూద్దాం...అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

►ALSO READ | Cocktail 2 Trailer: రొమాంటిక్గా రష్మిక కొత్త మూవీ ట్రైలర్.. ట్రయాంగిల్‌ రొమాన్స్ పీక్స్ అంతే

నటీనటుల వేట..

ఈ రా అండ్ రస్టిక్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ మూవీ కోసం చిత్రబృందం నటీనటుల వేట (Casting Call) మొదలుపెట్టింది. తెలంగాణ యాస, భాష ముచ్చటగా మాట్లాడటం వచ్చినోళ్లు, నటనపై ప్యాషన్ ఉన్న అన్ని వయసుల వారు తమ ఆడిషన్ వీడియోలను పంపించవచ్చు. అయితే మేకర్స్ ఒక స్ట్రిక్ట్ కండిషన్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) పంపితే అస్సలు ఒప్పుకోరు. కేవలం ప్రాపర్ ఆడిషన్ వీడియోలను మాత్రమే పంపాలి స్పష్టం చేసింది.. 

 ప్రాపర్ ఆడిషన్ వీడియోలను ఈమెయిల్: dsf.production02@gmail.com కు, లేదా వాట్సాప్ నెంబర్: 8096411437 పంపాలని మేకర్స్ తెలిపారు. మీలో నటుడు ఉంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ వివరాలు పంపేయండి. జమ్మికుంట మట్టి కథతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి DSF ప్రొడక్షన్స్ నంబర్ 2 రెడీ అయిపోతోంది మరి..