Allu Arjun: కొత్త వివాదంలో అల్లు అర్జున్.. 'ఆ ఒక్క మాట'తో సోషల్ మీడియాలో దుమారం!

Allu Arjun: కొత్త వివాదంలో అల్లు అర్జున్.. 'ఆ ఒక్క మాట'తో సోషల్ మీడియాలో దుమారం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో అభిమానులను ఉద్దేశించి చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ఉద్దేశం అభిమానులు సోషల్ మీడియాలో ద్వేషం, ట్రోలింగ్‌కు దూరంగా ఉండాలని చెప్పడమే అయినప్పటికీ..  ఉదాహరణగా ఆయన ఉపయోగించిన ఒక వాక్యం వివాదానికి కేంద్రబిందువైంది.

అసలేం జరిగిందంటే?

సభలో  అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'నా అభిమానులు, నన్ను ఇష్టపడని వాళ్లు, హేటర్స్ అందరికీ ఎప్పటినుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎవరో నచ్చలేదని వారిని ట్రోల్ చేస్తూ, ద్వేషిస్తూ మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు అంటూ ఫ్యాన్స్ సందేశం ఇచ్చారు.. మీ లక్ష్యాలు, కుటుంబం, కెరీర్, మీకు ఆనందం ఇచ్చే పనులపై దృష్టి పెట్టండి. నచ్చని వ్యక్తుల కోసం ఒక్క శాతం కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని బన్నీ స్పష్టం చేశారు. సమయం కూడా డబ్బులాంటిదే. మనకు నచ్చిన పనులకే దాన్ని ఖర్చు చేయాలి' అని అన్నారు. 

►ALSO READ | Sharwanand: 800 మంది ఆర్టిస్టులతో 'భోగి' క్లైమాక్స్ షూట్.. శర్వానంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ట్రీట్!

అమ్మాయి ఇంటి ముందు వెయిట్ చెయ్..

అయితే వెంటనే 'కావాలంటే నీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు నుంచోని వెయిట్ చెయ్ .. కనీసం నువ్వు అయినా సంతృప్తి పడతావు' అని చెప్పడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యను పలువురు నెటిజన్లు స్టాకింగ్‌ను సాధారణ విషయంగా చూపించేలా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమె ఇంటి ముందు వేచి ఉండడాన్ని సరదా ఉదాహరణగా చెప్పడం సరైన సందేశం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

నెట్టింట దుమారం..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై కొందరు.. 'ఇలాంటి మాటలు ఇప్పటికే తప్పు ఆలోచనలు ఉన్నవారిని మరింత ప్రోత్సహించే ప్రమాదం ఉంది' అని కామెంట్ చేస్తుండగా, మరికొందరు 'సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాటను లక్షలాది మంది అభిమానులు సీరియస్‌గా తీసుకుంటారు. అందుకే ఉదాహరణలు కూడా జాగ్రత్తగా ఉండాలి'అని పేర్కొంటున్నారు.

మరికొందరు మాత్రం అల్లు అర్జున్ అసలు ఉద్దేశాన్ని సమర్థిస్తున్నారు. ఆయన ట్రోలింగ్‌కు బదులుగా పాజిటివ్ విషయాలపై సమయం వెచ్చించాలనే సందేశం ఇవ్వాలని ప్రయత్నించారని, చివర్లో చెప్పిన ఉదాహరణను సందర్భం నుంచి వేరు చేసి విమర్శించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఉద్దేశం ఒకటా? ప్రభావం మరొకటా? అనే చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది.

ఇక ప్రస్తుతం బన్నీ దర్శకుడు అట్లీతో తెరకెక్కనున్న భారీ చిత్రం 'రాకా' నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అంటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది. ఈ వివాదం ఎంతవరకు కొనసాగుతుందో, దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.