యాంకర్ సుమ "జయమ్మ పంచాయితీ".. రోలు బద్దలైందిగా

యాంకర్ సుమ "జయమ్మ పంచాయితీ".. రోలు బద్దలైందిగా

తెలుగు యాంకర్ సుమ.. టీవీ ప్రేక్షకులకు, సినిమా అభిమానులకు ఈ పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. తన మాటలతో అందర్నీ కట్టి పడేస్తుంటోంది. సుమ షో చేస్తుందంటే.. ఇక అది హిట్ అన్నట్లే. ఎంతటి సెలబ్రిటీ అయినా సుమ పంచ్‌లకు పంచర్ అవ్వాల్సిందే. సుమ యాంకరింగ్ చేస్తున్నా.. ఏదైనా షోకు హోస్ట్‌గా వచ్చినా.. ఆ షోలో గెస్ట్‌గా వెళ్లిన సెలబ్రిటీలంతా... ఆచి తూచి మాట్లాడాల్సిందే. మాటకు మాట సమాధానం ఇవ్వడంలో సుమను మించిన వారు లేదు. ప్రస్తుతం సుమ... టీవీ షోలతోనే బిజీగా అయిపోయింది. గతంలో పలు సినిమాల్లో నటించి వెండితెరపై కూడా మెప్పించిన సుమ... కొన్నేళ్లుగా మాత్రం ఎక్కడా సినిమాల్లో కనిపంచలేదు. అయితే తాజాగా ఆమె లీడ్ రోల్ ప్లే చేస్తూ వెండి తెరపై మెరిసేందుకు సిద్ధమయ్యింది. ‘ జయమ్మ పంచాయతీ’ అనే పేరుతో వస్తున్న ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై రీ ఎంట్రీ ఇస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రిలీజ్ చేశారు.‘ ప్రతీ తెలుగువారు ఎంతగానే అభిమానించే సుమ గారికి అభినందనలు. మీరు వెండితెరను హిట్ చేసే టైం వచ్చేసింది’ అంటూ.. రామ్ చరణ్ జయమ్మ పంచాయతీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఎర్రని చీరలో సుమ కనిపిస్తోంది. రోలు దంచుతున్న స్టైల్‌లో సుమ కనిపించగా..ఆమె చీర కొంగుపై.... ఊరికి సంబంధించిన జనం, ఆ ఊరి పరిస్థితులు, పోలీస్ స్టేషన్, ఓ గుడితో గుడి పక్కనే ఓ వేప చెట్టు.. ఆ చెట్టుకు వేలాడుతూ ముగ్గురు వ్యక్తులు కనిపించారు. సుమ రోలు దంచగానే.. రోలు కూడా బద్దలయ్యేలా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తయారు చేశారు.

ఇక  సుమ సినిమాకు సంబంధించిన ఈ  మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తూ రామ్ చరణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు సుమ కూడా దీనిపై స్పందించింది. రామ్ చరణ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. వెన్నెల క్రియేషన్స్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం, స్క్రీన్ ప్లే, కథ, డైలాగ్స్ అందిస్తున్నారు. బలగా ప్రకాశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.మరి ఈ సినిమాతో సుమ వెండితెర ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటారో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తల కోసం 

కళ్లు ఎప్పుడు పీకేస్తున్నారు? కేసీఆర్‌ను ప్రశ్నించిన షర్మిల 

రాళ్లతో కొట్టుకుని పండుగ చేసుకున్న జనం