
- ఏటా దీపావళి తర్వాతి రోజు సంబురం.. వందేళ్లుగా ఆచారం
- ఫస్ట్ రక్తం వచ్చిన వ్యక్తి అదృష్టవంతుడని ఆ గ్రామ ప్రజల నమ్మకం
మన దేశంలో వెరైటీ ఆచారాలు, సంస్కృతులకు కొదవే లేదు. సంక్రాంతి సమయంలో తమిళనాడులో జల్లికట్టు.. దసరా సమయంలో ఏపీలోని కర్నూలులో కర్రల సమరం.. దీపావళి సమయంలో ఆదిలాబాద్‌లో దండారీ వేడుక ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉంటాయి. ఉత్తరాదిలో దీపావళి సమయంలో జరుపుకొనే ఓ వేడుక గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే దీపావళి తర్వాతి రోజు హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా సమీపంలో ఉన్న గలోగ్ గ్రామంలో ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి.. రాళ్లతో కొట్టుకుని పండుగ చేసుకుంటారు. ఇలా చేసే కాళీ మాత ఆశీస్సులు లభిస్తాయని అక్కడి వారి నమ్మకం.
గత ఏడాది కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ వేడుకను ఈ సారి సంబురంగా జరుపుకొన్నారు. శుక్రవారం ఉదయం మొదట కాళీ మాతకు పూజలు చేసి.. ఆ తర్వాత రెండుగా విడిపోయి దాదాపు అర గంట పాటు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ వేడుకలో మొదటగా ఎవరికి రక్తం వస్తే వారిని అదృష్టవంతులుగా చూస్తామని ఆ ఊరి వాళ్లు చెబుతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి రక్తాన్ని కాళీ మాత నుదుటిన తిలకంగా దిద్దుతామని, ఇలా చేస్తే ఏడాదంతా ఊరి ప్రజలకు మంచి జరుగుతుందని తమ పెద్దలు చెప్పేవారంటున్నారు. ఈ ఆచారాన్ని దాదాపు వందేళ్లకు పైగా పాటిస్తూ వస్తున్నామని తెలిపారు.
Himachal Pradesh: Two group of villagers of Shimla's Galog yesterday performed puja and ceremonial stone pelting, a centuries-old practice observed to appease Goddess Kali
— ANI (@ANI) November 6, 2021
Last year, the ceremony was not organised owing to COVID-19 pandemic. pic.twitter.com/77ztAfaU8x
ఆచారం వెనుక చరిత్ర ఏంటంటే..
ఈ ఆచారంపై రెండు రకాల కథలు ఆ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నాయి. ఒకటి పూర్వం దీపావళి తర్వాతి రోజు ఇక్కడ కాళీ మాతకు ఉత్సవాలు చేసేవారట. ఆ సమయంలో అమ్మవారికి నరబలి ఇచ్చేవారట. అయితే ఆ తర్వాతి కాలంలో పెద్దలు ఈ ఆచారాన్ని నిలుపుదల చేసేయాలని నిశ్చయించుకుని.. అమ్మను శాంతిపంజేయడం కోసం ఏటా ఈ రాళ్ల ఉత్సవాన్ని మొదలుపెట్టారని అక్కడి వాళ్లు కొందరు చెబుతున్నారు. నాటి నుంచి ఇలా రాళ్లతో కొట్టుకోవడం, మొదట ఎవరికి రక్తం వస్తే వాళ్ల రక్తాన్ని కాళీ మాతక నుదుట బొట్టు పెట్టడం ఆచారంగా వస్తోందన్నారు. ఇక మరో కథ ఏంటంటే.. పూర్వం ఈ గ్రామంలోని ఓ యువతికి రంగైళీ రాజ కుటుంబం యువరాజుతో పెండ్లి నిశ్చయమైందట. ఆ సమయంలో అది నచ్చని వర్గంలోని వాళ్లు యువరాజుకు విషమిచ్చి చంపేశారని, దీంతో ఆ యువతి ఆత్మాహుతి చేసుకుని ప్రాణాలు విడిచిందని చెబుతారు. దీంతో నాటి కాలంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాతి కాలంలో అదే రాళ్ల ఉత్సవంగా మారిందని గ్రామంలో కొందరు చెబుతున్నారు.