IND vs AUS: అతని ఆట ఇండియాకు కలిసొచ్చింది.. గిల్ స్లో బ్యాటింగ్‪పై ఆస్ట్రేలియా బౌలర్ ప్రశంసలు

IND vs AUS: అతని ఆట ఇండియాకు కలిసొచ్చింది.. గిల్ స్లో బ్యాటింగ్‪పై ఆస్ట్రేలియా బౌలర్ ప్రశంసలు

టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ ఆస్ట్రేలియా టూర్ లో తడబడుతున్నాడు. వన్డే సిరీస్ లో పూర్తిగా విఫలమైన గిల్.. టీ20 సిరీస్ లో ఆకట్టుకోలేకపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో విఫలమైన ఈ టీమిండియా ఓపెనర్ నాలుగో టీ20లో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే గిల్ 39 బంతుల్లో 46 పరుగులు చేయడంతో విమర్శలు మొదలయ్యాయి. స్లో గా బ్యాటింగ్ చేశాడని నెటిజన్స్ ఫైరవుతున్నారు. గిల్ టీ20 ఫార్మాట్ కు సెట్ కాడని.. అతని స్థానంలో సంజు శాంసన్ లేదా అభిషేక్ శర్మకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

గిల్ స్లో గా బ్యాటింగ్ చేసినా ఈ ఇన్నింగ్స్ పై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ బ్యాటింగ్ పై ఎల్లిస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " ఈ రోజు గిల్ఆడిన ఇన్నింగ్స్ ఖచ్చితంగా టీ20 స్థాయికి తగినది కాదు. కానీ గిల్ ఈ రోజు ఆడిన ఇన్నింగ్స్ ఇండియాకు చాలా ముఖ్యమైనది. అతని ఇన్నింగ్స్ భారత స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లింది". అని ఎల్లిస్ అన్నాడు. ఈ మ్యాచ్ లో 39 బంతుల్లో 46 పరుగులు చేసిన గిల్.. ఎల్లిస్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు.ఈ మ్యాచ్ లో ఎల్లిస్ మూడు వికెట్లు పడగొట్టి ఇండియాను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్ పై టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ కూడా కొనియాడాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి ముందు భారీ స్కోర్ ఉంచకపోయినా బౌలింగ్ లో అదరగొట్టి కంగారులను చిత్తు చేసింది. గురువారం (నవంబర్ 6) క్వీన్స్‌ల్యాండ్ లో కర్రారా ఓవల్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 48 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లారు. మొదట బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్ లో అత్యద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

 ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమాన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అభిషేక్ శర్మ (28), సూర్య కుమార్ యాదవ్ (20) కొన్ని మెరుపులు మెరిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్, జంపా తలో మూడు వికెట్లు తీసుకున్నారు. బార్ట్ లెట్, మార్కస్ స్టోయినిస్ లకు తలో ఒక వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. ఇండియా బౌలర్లలో వాషింగ్ టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబే, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా లకు తలో వికెట్ లభించింది.