అంత్యక్రియలు ఏర్పాటు చేస్తుండగా అద్భుతం.. అంబులెన్స్ కుదుపుతో బతికిన బ్రెయిన్ డెడ్ మహిళ!

 అంత్యక్రియలు ఏర్పాటు చేస్తుండగా అద్భుతం.. అంబులెన్స్ కుదుపుతో బతికిన బ్రెయిన్ డెడ్ మహిళ!

ఉత్తరప్రదేశ్‌లో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ మహిళ, అంబులెన్స్ ప్రయాణంలో ఎదురైన ఒక రోడ్డు గుంత కారణంగా తిరిగి ప్రాణాలు పోసుకుంది.

పిలిభిత్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల వినీతా శుక్లా సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 22న ఆమె ఇంట్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా  స్పృహతప్పి పడిపోయారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను బరేలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెని పరీక్షించిన డాక్టర్లు  ఆమె మెదడు పని చేయడం ఆగిపోయిందని, బ్రెయిన్ డెడ్ అయిందని... ఇక బతికే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఆశలు కోల్పోయిన ఆమె భర్త కుల్దీప్ కుమార్, ఫిబ్రవరి 24న ఆమెను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇంటి దగ్గర  అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయమని  బంధువులకు కూడా సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ హరీద్వార్ హైవేపై వెళ్తుండగా, హఫీజ్‌గంజ్ వద్ద ఒక పెద్ద గుంతను గట్టిగ ఢీకొట్టింది. ఆ కుదుపునకు అంబులెన్స్  ఒక్కసారిగా ఎగిసి పడింది. చిత్రంగా కొద్దీ క్షణాలల్లోనే  వినీతలో కదలికలు మొదలై, ఆమె మళ్ళీ శ్వాస తీసుకోవడం ప్రారంభించారు.


దింతో వెంటనే ఆమెను పిలిభిత్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ న్యూరో సర్జన్ డాక్టర్ ఆమెకు చికిత్స అందించారు. పరీక్షల్లో ఆమె రక్తంలో తీవ్రమైన న్యూరోటాక్సిన్లు ఉన్నట్లు గుర్తించారు. సరైన రోగ నిర్ధారణ చేసి చికిత్స అందించడంతో ఆమె  కోలుకున్నారు. ఆసుపత్రిలో కొన్ని రోజులు చికిత్స అందించిన తర్వాత, వినీత పూర్తిగా స్పృహలోకి వచ్చింది. 

డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయేలా కోలుకున్న వినీత, సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. చావు అంచు వరకు వెళ్లి, అంబులెన్స్ ప్రయాణంలో జరిగిన ఆ చిన్న ప్రమాదం వల్ల ఆమెకు పునర్జన్మ లభించిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.