హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. మెట్రో స్టేషన్లను కేవలం ప్రయాణ కేంద్రాలుగా కాకుండా ఫ్లెక్స్ బుల్ వర్క్ స్పేస్ లుగా, కోవర్కింగ్ సెంటర్లుగా, శాటిలైల్ ఆఫీసులుగా డెవలప్ చేస్తోంది. ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్ మెంట్ (TOD) వ్యూహంలో భాగంగా ఈ విధానాన్ని రూపొందించింది.
ప్రణాళికలో భాగంగా మూడు మెట్రో కారిడార్లలోని 57 స్టేషన్లలో ఆఫీసుల కోసం స్పేస్ గుర్తించారు. ఇప్పటికే జేబీఎస్ మెట్రో స్టేషన్‌లో కోహోర్ట్ కో-వర్కింగ్ కేంద్రం నడుస్తోంది. గోల్డెన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ జేబీఎస్ స్టేషన్‌లో తన ఆఫీసును ఏర్పాటు చేసింది.
ఆఫీసులు, బిజినెస్ కార్యకలాపాలను రవాణా మౌలిక సదుపాయాలతో ఏకం చేయడమే ఈ మోడల్ ముఖ్య ఉద్దేశం. ఈ మోడల్ తో ఉద్యోగుల ప్రయాణ దూరం తగ్గడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రజారవాణా వినియోగం పెరిగే అవకాశం ఉంది.
ఆఫీస్ బబుల్స్ ద్వారా కంపెనీలకు మెరుగైన కనెక్టివిటీ, తక్కువ రవాణా ఖర్చులు, ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు, నిరంతరం విద్యుత్, భద్రత, ప్రామాణిక సౌకర్యాలు లభిస్తాయి. అయితే ఆఫీసులో ఏవైనా మార్పులు చేయాలంటే తప్పనిసరిగా ఎల్‌అండ్‌టీ మెట్రో అనుమతి తీసుకోవాలి.
ఈ సిస్టమ్ పై ఉద్యోగులనుంచి సానుకూల స్పందన వస్తోంది. ఈ వర్క్‌స్పేస్‌లు సమయం, ఖర్చు ఆదా చేయడమే కాకుండా ప్రయాణ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తున్నాయంటున్నారు. రోటీన్ ఆఫీసులతో పోలిస్తే ప్రాడక్టివిటీలో కూడా పెద్దగా తేడా లేదని చెబుతున్నారు. అయితే వ్యక్తిగత వాహనాలతో వచ్చే వారికి పార్కింగ్ పరిమితులు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా, హైదరాబాద్ మెట్రో స్టేషన్లను ఆధునిక పట్టణ కేంద్రాలుగా మార్చే దిశగా ‘ఆఫీస్ బబుల్స్’ కీలకంగా మారుతున్నాయి.
