న్యూఢిల్లీ: బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను మోసపూరిత జాతీయవాదులు అని అభివర్ణించిన ఆయన.. ప్రధాని మోడీని అబద్ధాల మాస్టర్ అని విమర్శించారు. అమిత్ షాని కేవలం బడాయి మాటలు చెప్పడం.. ఆర్భాటాలు చేసే వ్యక్తిగా అభివర్ణించారు.
ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైరాం రమేష్ మాట్లాడుతూ.. భారతదేశానికి లభించిన అత్యుత్తమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ఇక, ప్రధాని పదవిని చేపట్టే అవకాశం దక్కకపోయినా.. దేశానికి లభించలేని అత్యుత్తమ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన అభిప్రాయపడ్డారు.
తన పొలిటికల్ ఎంట్రీ, ఇతర విషయాలపైన జైరాం రమేష్ మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ అని తెలిపారు. తమతో కలిసి పని చేయాలని రాజీవ్ గాంధీ ఇచ్చిన పిలుపుతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ తన బంధం ఇప్పటికీ 35 సంవత్సరాలు పూర్తి అయ్యిందని తెలిపారు. ఏ రాష్ట్రానికైనా ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా పనిచేయడం కంటే పార్టీ కమ్యూనికేషన్స్ విభాగానికి బాధ్యత వహించడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
