ప్రమాదంలో భర్త మరణిస్తే..రెండో భార్యకు నష్టపరిహారం వర్తిస్తుంది:కర్నాటక హైకోర్టు కీలక తీర్పు

ప్రమాదంలో భర్త మరణిస్తే..రెండో భార్యకు నష్టపరిహారం వర్తిస్తుంది:కర్నాటక హైకోర్టు కీలక తీర్పు

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిపై ఆధారపడి జీవిస్తున్న రెండో భార్య, ఆమె కుమార్తె కూడా నష్టపరిహారానికి అర్హులేనని కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నష్టపరిహారం పొందే చట్టపరమైన ప్రతినిధులను (అర్హులను)నిర్ణయించే విషయంలో ఎటువంటి నిబంధనలు ఉండకూడదని జస్టిస్ జయంత్ బెనర్జీ, జస్టిస్ తారా వితస్తా గంజూ ధర్మాసనం స్పష్టం చేసింది.

బీమా చేసిన వెహికల్ కారణంగా జరిగిన ప్రమాదంలో చనిపోయిన ఓ పూల రైతు కేసులో ఈ తీర్పు వెలువడింది. మృతుడి మొదటి భార్య, తల్లి, రెండో భార్య, మైనర్ కుమార్తె పరిహారం కోసం దావా వేశారు. రెండో భార్య, కుమార్తె మృతుడిపై పూర్తిగా ఆధారపడి ఉన్నారని, ఆయన మృతితో వారు ఆర్థికంగా నష్టపోయారని కోర్టు గుర్తించింది.

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం పరిహారం పొందే హక్కు కేవలం భార్య లేదా భర్త, తల్లిదండ్రులు, పిల్లలకే పరిమితం కాదని హైకోర్టు పేర్కొంది. మృతుడిపై ఆధారపడి జీవించిన వారు, అతని మరణంతో నష్టం చవిచూసిన వారందరూ నష్టపరిహారానికి అర్హులని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా ధర్మాసనం ప్రస్తావించింది.

మరోవైపు మృతుడి నెలవారీ ఆదాయాన్ని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) రూ.10 వేలుగా నిర్ణయించడం తప్పని హైకోర్టు పేర్కొంది. ప్రమాదం జరిగిన 2019 సంవత్సరానికి అనుగుణంగా నెలవారీ ఆదాయం రూ.14 వేలుగా పరిగణించింది.

ట్రిబ్యునల్ ఇచ్చిన పరిహారానికి అదనంగా రూ.15,02,400 చెల్లించాలని, అలాగే సంవత్సరానికి 9 శాతం వడ్డీతో మొత్తం నలుగురు క్లెయిమ్‌దారులకు పరిహారం అందించాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.