తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నిఖర వాటా జలాల వినియోగానికి భాగస్వామ్య రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, కర్ణాటకల మధ్య సమన్వయం కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర జల సంఘం (CWC) ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని కోరారు.
తుంగభద్ర నది నుంచి తెలంగాణకు దక్కాల్సిన నీటి హక్కులపై సీఎం రేవంత్ రెడ్డి జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై సుదీర్ఘంగా చర్చించారు. నిబంధనల ప్రకారం తుంగభద్ర నుంచి తెలంగాణకు 15.9 టీఎంసీల నికర వాటా నీరు రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఐదారు టీఎంసీలకు మించి రాకపోవడంపై సీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జోగులాంబ గద్వాల జిల్లాలోని 75 గ్రామాల్లో.. దాదాపు 84 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక రైతాంగం ఇబ్బంది పడుతోందని సీఎం గుర్తు చేశారు.
మరోవైపు... రాజోలి బండ డైవర్సన్ కెనాల్ (RDS) ఆధునికీకరణ పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై సీఎం సీరియస్ అయ్యారు. ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 59 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినా... ప్యాకేజీ 1, 2 పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై అధికారులను నిలదీశారు. రేపు కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే కీలక సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు.
ఆర్డీఎస్ వద్ద తెలంగాణ వైపు పూడిక పేరుకుపోవడం వల్ల నీటి మళ్లింపు కష్టంగా మారిందని ఇంజనీర్లు సీఎం దృష్టికి తెచ్చారు. పూడిక ఉన్న భూభాగం కర్ణాటకలో ఉన్నందున, ఆ రాష్ట్ర సహకారంతో వెంటనే పూడికతీత పనులు చేపట్టేలా కేంద్రానికి వినతిపత్రం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా... తుంగభద్ర ఎత్తిపోతల పథకం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని, అలాగే తుమ్మిళ్ల నుంచి నీటిని వాడుకునేందుకు వీలుగా మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి, పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
