- ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ
ముషీరాబాద్, వెలుగు: అధికారం కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చని, కానీ సంస్కృతిని ఒకసారి కోల్పోతే దాని మూలాలను తిరిగి సాధించుకోవడం సాధ్యం కాదనే విషయాన్ని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గుర్తించారని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయశంకర్ స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడారు.
నిర్మాణాత్మక ఆలోచనలతో సాగిన తెలంగాణ ఉద్యమానికి, ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న ఉద్యమాలకు చాలా తేడా ఉందన్నారు. గత 12 ఏళ్లుగా దేశంలో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్న ప్రధాని మోదీ ప్రభావాన్ని జంతర్‌మంతర్ వద్ద నిరసనలు తెలిపిన యువత తగ్గించిందని పేర్కొన్నారు.
అంతకుముందు ‘స్వరాష్ట్రంలో స్వయంపాలన’ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఓయూ మాజీ వీసీ రవీందర్ యాదవ్, పి. వేణుగోపాల్ స్వామి, ములక సురేశ్, రమణ, శ్రీకాంత్, ఆసరి రాజు, పులి రాజు, రూబీ స్టీఫెన్‌సన్, గురువారెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు
పాల్గొన్నారు.
